మోంథా తుఫాను ఎఫెక్ట్.. ఏపీతో పాటు ఒడిషా, తమిళనాడు అల్లకల్లోలం

మోంథా తుఫాను ఎఫెక్ట్.. ఏపీతో పాటు ఒడిషా, తమిళనాడు అల్లకల్లోలం

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తీవ్ర తుఫాన్‌‎గా మారిన మోంథా సైక్లోన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మోంథా.. మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి, లేదా బుధవారం (అక్టోబర్ 30) ఉదయం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. మోంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‎తో పాటు ఒడిషా, తమిళనాడు రాష్ట్రాలపైన తీవ్రంగా పడింది. 

ఒడిశా హై అలర్ట్:

మోంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‏తో పాటు ఒడిషాపైన పడింది. ముఖ్యంగా ఒడిశాలోని ఎనిమిది దక్షిణ జిల్లాలు మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, రాయగడ, గజపతి, గంజాం, కలహండి, కంధమల్‌‎పై తీవ్ర ప్రభావం చూపించనుంది. తుఫాను నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 

ఈ మేరకు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహకయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా1,496 మంది గర్భిణీ స్త్రీలు సహా దాదాపు 3,000 మందిని తరలించారు. 1445 తుఫాను ఆశ్రయాలను తెరిచారు. 140 రెస్క్యూ బృందాలను మోహరించింది. తుఫాను ప్రభావానికి గురయ్యే తొమ్మిది జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలకు అక్టోబర్ 30 వరకు సెలవులు ప్రకటించారు. 

తమిళనాడులో భారీ వర్షాలు:

మోంతా తుఫాను ప్రభావంతో చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట, కాంచీపురంతో సహా ఉత్తర తమిళనాడులో మంగళవారం (అక్టోబర్ 28)  భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. తుఫాను ఏపీ తీరం దాటిన కూడా ఈ ప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) తెలిపింది.

 తుఫాను ఎఫెక్ట్‎తో తిరువళ్లూరు, చెన్నై జిల్లా కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.