ఒలింపిక్స్: బీచ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌‌కు కరోనా

ఒలింపిక్స్: బీచ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌‌కు కరోనా

టోక్యో: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జపాన్ రాజధాని టోక్యోలో నిర్మించిన ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ ప్లేయర్లు, ఒక అనలిస్ట్‌కు వైరస్ సోకింది. ఒలింపిక్ విలేజ్‌లో ముందు జాగ్రత్తగా రోజువారీగా జరుగుతున్న టెస్టుల్లో మరో ప్లేయర్‌‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్వాహకులు ప్రకటించారు. చెక్‌ రిపబ్లిక్‌ బీచ్‌ వాలీబాల్ ప్లేయర్ ఒన్‌డ్రెజ్‌ పెరుసిక్‌కు వైరస్ సోకింది. అతడికి ఎటువంటి సింప్టమ్స్‌ లేవని చెక్‌ రిపబ్లిక్ప్ ఒలింపిక్‌ టీమ్‌ హెచ్ మార్టిన్ దోక్టర్ తెలిపారు. టీమ్‌లో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్‌ విలేజ్‌లో కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒలింపిక్‌ విలేజ్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 6700 మంది అథ్లెట్స్, అఫిషియల్స్ ఉన్నారు. వాస్తవానికి గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. భారత్‌ నుంచి 119 మంది అథ్లెట్స్‌ ఈ ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. మేనేజర్లు, టీమ్‌ అధికారులు సహా మొత్తం 228 మంది బృందం ఒలింపిక్‌ విలేజ్‌కు వెళ్తోంది. ఇందులో ఇప్పటికే రోయింగ్‌, షూటింగ్‌, బాక్సింగ్, సెయిలర్స్ టీమ్‌లు టోక్యో చేరుకున్నాయి.