D55 Sreeleela: క్రేజీ కాంబినేషన్ ఫిక్స్.. ధనుష్‌తో జతకట్టిన శ్రీలీల.. సక్సెస్ ట్రాక్ ఎక్కేనా?

D55 Sreeleela: క్రేజీ కాంబినేషన్ ఫిక్స్.. ధనుష్‌తో జతకట్టిన శ్రీలీల.. సక్సెస్ ట్రాక్ ఎక్కేనా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ మూవీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ‘D55’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ధనుష్ తన నిర్మాణ బ్యానర్ అయిన వుండర్‌బార్ ఫిల్మ్స్ మరియు ఆర్‌టేక్ స్టూడియోస్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధనుష్ సినిమాకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీలీల, ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకోవడం విశేషం.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆమె నటించిన చిత్రాలు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే వరుస హిట్‌లతో దూసుకెళ్తున్న ధనుష్‌తో కలిసి చేస్తున్న ఈ సినిమా అయినా, శ్రీలీలకు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

ఈ క్రమంలో ధనుష్–శ్రీలీల జంటపై అభిమానులు తమ ఉత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ “ఓరి దేవుడా... ఈ కాంబో కోసం ఇక వేచి ఉండలేను!” అని వ్యాఖ్యానించగా, మరో అభిమాని “బెస్ట్ కాంబినేషన్… సక్సెస్ పక్కా!” అంటూ స్పందిస్తున్నారు. 

‘D55’ OTT స్ట్రీమింగ్ వివరాలు

‘D55’ చిత్రం థియేటర్లలో విడుదలైన అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. జనవరి న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం.

ధనుష్–శ్రీలీల గత చిత్రాలు

ధనుష్ చివరిసారిగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తేరే ఇష్క్ మే చిత్రంలో కృతి సనన్‌తో కలిసి నటించాడు. ఈ సినిమా 2025 నవంబర్ 28న థియేటర్లలో విడుదలై, 2026 జనవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చింది.

మరోవైపు, శ్రీలీల ఇటీవల సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్ సరసన కనిపించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.