
దాద్రా నగర్ హవేలీ లోక్ సభ ఎంపీ మోహన్ డెల్కర్(58) అనుమానస్పద స్థితిలో మరణించారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హోటల్ సిబ్బంది ద్వారా డెల్కర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరి, ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎంపీగా ఏడు సార్లు గెలుపొందిన మోహన్ డెల్కర్.. 1986 లో కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి తప్పుకుని, స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ డెల్కర్ జేడీయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జేడీయూకు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది.