పనులు దొరుకుతలేవ్ ... సొంతూళ్లకు పోతం

పనులు దొరుకుతలేవ్ ... సొంతూళ్లకు పోతం

సెకండ్ వేవ్​తో మళ్లీ ఆగమైతున్న అడ్డా కూలీలు
ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో  కుటుంబ పోషణ భారం 
ఇంటి రెంట్లు సైతం కట్టలేని పరిస్థితి
కన్ స్ట్రక్షన్, హోటల్, ఇతర  రంగాల్లోని వలస కార్మికులకు  తప్పని ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్​వేవ్​తో గ్రేటర్​లోని అడ్డా కూలీలు, వలస కార్మికులు ఆగమైతున్నారు. సిటీలో బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో కూలీలుగా, హమాలీ పని, హోటల్​లో సర్వెంట్లుగా, క్యాటరింగ్ వర్క్ చేస్తూ లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పడు వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతేడాది లాక్ డౌన్ నుంచి రోజువారీ కూలీలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. పొట్టచేత పట్టుకుని పల్లెలొదిలి పట్నం వచ్చినవారు ఇప్పుడు మళ్లీ పల్లె బాట పడుతున్నారు. హోటల్ రంగంలో ఇప్పటికే 20శాతం మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. పనులు లేని కారణంగా మిగతా వారిని కూడా తీసేసే ఆలోచనలో ఉన్నాయి యాజమాన్యాలు. మరోవైపు హమాలీ పని, రాల్లెత్తడం, కంకరకొట్టడం, బేస్ మెంట్లు తవ్వడం, ఇతరాత్ర పనులు కూడా ఇప్పుడు ఆగిపోయాయి. దీంతో పనికోసం అడ్డాల దగ్గర గంటల తరబడి నిలబడుతున్నా ఫలితం ఉంటలేదని కూలీలు అంటున్నారు.
 కాంట్రాక్టర్ పని ఇప్పిస్తేనే.. 
  పొద్దున్నే వచ్చి అడ్డా మీద నిల్చుంటే ఏ కాంట్రాక్టరో వచ్చి తీసుకుపోయి పని ఇప్పిస్తే ఆ రోజుకి పూట గడుస్తుందని అడ్డాకూలీలు చెప్తున్నారు. సిటీలోని టోలీచౌకి, ఫిలింనగర్, అమీర్ పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, తార్నాక, దిల్ సుఖ్ నగర్  లాంటి ఏరియాల్లో ఉదయం 7గంటలకే  వీరు రోడ్డు మీదకి వచ్చి పనికోసం ఎదురుచూస్తుంటారు.  వీరంతా తెలంగాణాలోని  జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు.   కరోనా మొదలైనప్పటి నుంచి తమ పరిస్థితి దారుణంగా మారిందని వారు చెప్తున్నారు. సెకండ్​వేవ్​తో  నెల రోజులుగా పనిదొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఇంటి అద్దె  కట్టడం దగ్గరి నుంచి నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా  కూలీ పనే దిక్కని, ఇప్పుడు ఏం జేయాలో తెలస్తులేదని చెప్తున్నారు.   ఇప్పటికే కొంతమంది అడ్డాకూలీలు సొంతూళ్లకు   వెళ్లిపోగా, కొందరు పిల్లలను పంపేసి పనుల కోసం ప్రయత్నిస్తున్నారు.  
 హోటల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ..  
  సిటీలో అత్యధికంగా వర్కర్లు పనిచేసేది, ఉపాధి పొందేది హోటల్ రంగంలోనే.  ఇక్కడి హోటల్స్, రెస్టారెంట్లలో  పనిచేస్తున్న వారిలో సిటీతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, బిహార్, చత్తీస్ గఢ్, కర్ణాటక, యూపీ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.  హోటల్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం గ్రేటర్ లో  దాదాపు 3 లక్షలమంది ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. కరోనాతో  గతేడాది నుంచి హోటల్ ఇండస్ట్రీ మొత్తం ఢీలా పడిపోయింది. సిటీవ్యాప్తంగా అకామిడేషన్ కల్పించే హోటల్స్ 2,500 నుంచి 3వేల వరకు ఉండగా, ఫుడ్ మాత్రమే అందించే రెస్టారెంట్లు చిన్నవి, పెద్దవి కలుపుకొని 10 వేల నుంచి 15వేల వరకు ఉన్నాయి. గతేడాది అన్ లాక్ ప్రారంభమైన  మొదట్లో 30 నుంచి 40శాతం మాత్రమే జరిగిన బిజినెస్ ఆ తర్వాత సగానికి పైగా పికప్ అయ్యింది. బిజినెస్ క్రమంగా పెరుగుతున్న టైమ్​లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్​తో వర్కర్లు మళ్లీ సొంతూళ్ల బాట పడుతున్నారు. ఇప్పటికే 20శాతం మంది వర్కర్లు సొంతూర్లకు వెళ్లిపోయారు. బిజినెస్ జరగని కారణంగా మిగతా 80శాతంమందిని కూడా తీసేసే ఆలోచనలో హోటళ్ల యాజమాన్యాలు ఉన్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా లక్షమందికి పైగా ఉపాధి కోల్పోయారు. 


పూర్తిగా ఢీలా.. 
హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా ఢీలా పడిపోయింది. అన్​లాక్ తర్వాత బిజినెస్ అవుతుందని భావించిన టైమ్​లో సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బకొట్టింది. ఇంకో నెలలో 50శాతం హోటళ్లు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఓనర్లు ఉన్నారు. గతేడాది లాక్ డౌన్​లో వెళ్లిపోయిన కార్మికుల్లో 80 శాతం  మంది తిరిగొచ్చారు. అందులో ఇప్పుడు మళ్లీ 20 శాతం వెళ్లిపోయారు. మిగతా వారు ఉపాధికోసం ఉందామనుకున్నా పనిలోపెట్టుకుని జీతాలు ఇచ్చే స్థితిలో హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు లేవు. మరో రెండేళ్ల వరకు హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా కోలుకోదు. చాలామంది ఈ బిజినెస్ నుంచి బయటపడాలని చూస్తున్నారు.      -  అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ               హోటల్స్ అసోసియేషన్