డెయిరీలు మూతపడుతున్నయి

డెయిరీలు మూతపడుతున్నయి

పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ సర్కారు సరైన ప్రోత్సాహం అందించకపోవడంతో పాడి రైతులు డెయిరీలను క్లోజ్​ చేసుకుంటున్నారు. పశువుల దాణా ధరలు, నిర్వహణ ఖర్చులు బాగా పెరగడంతో డెయిరీ నిర్వాహకులు పశువులకు దాణా అందించలేకపోతున్నారు. రైతులు ఎక్కువగా పత్తి దాణా, గోధుమ పొట్టు, మొక్కజొన్న పిండి, పల్లీ పిండి, కొబ్బరి పిండిని పెడుతుంటారు. గతేడాది పత్తి దాణా కిలో రూ.40 ఉండగా, ప్రస్తుతం రూ.50 అయ్యింది. మొక్కజొన్న రూ.40, పల్లిపిండి రూ.60 అయింది. కొబ్బరి దాణా ప్రస్తుతం రూ.55 ఉన్నది. దీంతో పాడి రైతులకు పశు పోషణ భారమవుతోంది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. కొత్తగా ఆవులు, గేదెలు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.  

పశువులను అమ్ముకుంటున్న రైతులు

పాడిని నమ్ముకున్న రైతులు లాభాలు లేక పశువులను సంతలలో అమ్ముకుంటున్నారు. మరికొందరు కబేళాలకు చేర్చుతున్నారు. కరోనా ఎఫెక్టుతో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో నిర్వహణ భారం పెరిగింది. కానీ పాల ధరలో మార్పు లేక పోవడంతో నష్టాలు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డెయిరీలో ఆవు పాలు లీటర్ రూ.30,  గేదె పాలు రూ.39 ఉంది. ప్రైవేటుగా అమ్ముకుంటే ఆవుపాలు లీటర్ రూ.90 నుంచి  100 ఉండగా, గేదె పాలు రూ.70 నుంచి రూ.80 ఉంది. 

వైద్యసేవలు అందుతలేవు..

ప్రభుత్వం వెటర్నరీ సేవలు అందుబాటులో ఉండేలా 1962పై అంబులెన్సు ఏర్పాటు చేసినా దాని ద్వారా పాడి రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. పశువులకు జబ్బు చేస్తే డాక్టర్​మందులు రాసిస్తున్నాడని, మందులు ఆస్పత్రిలో లేకపోవడంతో ప్రైవేటు షాపుల్లో కొనుక్కుంటున్నామని రైతులు వాపోతున్నారు. 20 గేదెలు ఉంటే ప్రతీ నెల వైద్యానికే సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు.

సర్కార్ సపోర్ట్ చేయాలె

మాది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్. గ్రామంలో నేను బొగ్గు గనిలో పనిచేసి రిటైరయ్యాను. అనంతరం పాల డెయిరీ స్టార్ట్ చేశాను. 21 గేదెలు, 8 మేలు రకం ఆవులు, ఒక దున్న తెచ్చి పోషిస్తున్నాను. నా దగ్గర 15 మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ రోజూ 135 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెయిరీ నడుపుడు కష్టమైతంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు లేవు. పశువులకు సరైన వైద్యం, మందులు అందుబాటులో లేవు. ప్రభుత్వం అన్ని రంగాలను ఏదో విధంగా ఆదుకుంటుంది. అలాగే పాడి పరిశ్రమను కూడా ఆదుకోవాలి.

- బిరుదు రాజయ్య, అడవి శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా