- సొంత కులస్తులచే అంత్యక్రియలు
ఎల్కతుర్తి, వెలుగు : పంచాయతీ ఎన్నికలు గ్రామస్తుల మధ్య కొత్త పంచాయితీకి దారితీశాయి. బీసీ కులానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా అంత్యక్రియలు చేసేందుకు దళిత కుటుంబాలు ముందుకురాలేదు. దీంతో గొల్ల కురుమలు అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. తాజా పంచాయతీ ఎన్నికల్లో ఎల్కతుర్తి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది.
ఇద్దరు దళిత మహిళలు పోటీలో నిలిచారు. వీరిలో అంబాల స్వప్న--ను కాంగ్రెస్ బలపర్చింది. మునిగడప లావణ్య-కు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. కాగా.. అభ్యర్థులు ఇద్దరూ ఎస్సీ ఉపకులాలకు చెందినవారు. గురువారం జరిగిన తొలి విడత పోలింగ్ లో మునిగడప లావణ్య గెలుపొందారు. గ్రామంలో బీసీ కులానికి చెందిన బీఆర్‌ఎస్‌నేత ముద్దరబోయిన వెంకటేశ్యాదవ్అనారోగ్యంతో శుక్రవారం చనిపోయాడు. శనివారం అంత్యక్రియలు చేసేందుకు దళిత సంఘం పెద్ద మనుషులను సంప్రదించారు.
దీంతో ఇకపై డప్పులు కొట్టమని, పాడే పేర్చమని తేల్చిచెప్పి సహాయ నిరాకరణ పాటించారు. గ్రామ పెద్దలు చొరవ తీసుకుని మాట్లాడినా ఫలితం లేదు. చేసేదేమీ లేక కురుమ కులస్తులు ఒగ్గు కళా బృందం సాయంతో డప్పులు సమకూర్చగా, మృతుడికి గొల్ల కులస్తులు పాడె కట్టి, కాడు పేర్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇది స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
