వాసాలమర్రిలో దళితబంధు యూనిట్లు  ఇంకా ఫైనల్​ కాలే!

వాసాలమర్రిలో దళితబంధు యూనిట్లు  ఇంకా ఫైనల్​ కాలే!

యాదాద్రి, వెలుగు: వాసాలమర్రిలో  కేసీఆర్​దళితబంధు పథకాన్ని ప్రకటించి నెల గడుస్తున్నా ఏ ఒక్క లబ్ధిదారుడికీ ఇప్పటివరకు యూనిట్లు మంజూరు చేయలేదు. కలెక్టర్​ఖాతాలో డబ్బులు రెడీగా ఉన్నాయి. లబ్ధిదారుల స్వయం ఉపాధి ఆలోచనలు ఆఫీసర్లకు నచ్చకపోవడంతో పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాసాలమర్రికి ఆగస్టు 4న వచ్చిన సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించారు. ఆ మరుసటి రోజే.. ఇంటికి పది లక్షల లెక్క.. 76 కుటుంబాలకు సంబంధించి రూ. 7.60 కోట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఖాతాలో వేశారు. ఆ రోజు నుంచి వాసాలమర్రికి ఆఫీసర్ల రాక మొదలైంది. ఎస్సీ కుటుంబాలకు సంబంధించి ఎవరెవరు ఏఏ పనులు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఎంతమందికి భూమి ఉందో ఆరా తీశారు. ఉపాధి కోసం యూనిట్లు సెలక్ట్ చేసుకోవాలని ఆఫీసర్లు సూచించారు. దీంతో ఎవరికి వారు.. తాము చేసే పనికి సంబంధించిన వాటిల్లో ట్రాక్టర్లు, ఆటోలు, డెయిరీ ఫాం, వెల్డింగ్ షాపు, సెంట్రింగ్ సహా పలు యూనిట్లను ఎంపిక చేసుకొని ఆఫీసర్లకు వివరాలు అందించారు. ఆ తర్వాత ఆఫీసర్లు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు ఇంటింటికి వెళ్లి.. మళ్లీ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్సీలు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఇచ్చిన డబ్బు కంటే యూనిట్ రేటు తక్కువ అవుతుందని, వేరేదిఎంపిక చేసుకోమని కొందరికి సూచించారు. ఒకే యూనిట్​ఇద్దరు ముగ్గురు సెలక్ట్ చేసుకున్నారని, మార్చుకోవాలని సలహాలు ఇస్తున్నారు.  భూమి లేకుండా బర్రెలకు గడ్డి తేవడం కష్టమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ వేరే యూనిట్లు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. కొందరికి పచ్చళ్ల బిజినెస్ పెట్టుకోమని సూచించిన ఆఫీసర్లు.. ఇతర ప్రాంతాల్లో సేల్స్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. కొందరు ట్రాక్టర్లు, ఆటో యూనిట్లు పెట్టుకుంటామని చెప్పడంతో.. ఇప్పటికే చాలా ఉన్నాయని, ఇప్పుడు ఇంతమంది మళ్లీ ఇవే  యూనిట్లు ఎంపిక చేసుకుంటే ఎవరికీ సరైన ఉపాధి లభించదని చెబుతున్నారు. సరైన యూనిట్ సెలక్ట్ చేసుకోవాలని,  అప్పటిదాకా మీ పది లక్షలు కలెక్టర్ ఖాతాలోనే ఉంటాయని ఆఫీసర్లు అంటున్నారు.  దీంతో ఏ యూనిట్ ఎంపిక చేసుకోవాలో అర్థం కాక లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. తాము చేసే పనులనే ఎంపిక చేసుకున్నామని, అవి కాకుండా కొత్తగా వేరే పనులు ఎలా చేయగలమని లబ్ధిదారులు  ప్రశ్నిస్తున్నారు. 

క్లారిటీ రాగానే.. చెక్కులు

హుజూరాబాద్​లో 20 రోజుల క్రితమే కొందరికి యూనిట్లు ఇవ్వడంతో వాసాలమర్రిలో కూడా వెంటనే ఇస్తారని లబ్ధిదారులు అనుకున్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది పాల యూనిట్లు, ట్రాన్స్​పోర్ట్ సెలక్ట్ చేసుకున్నారు. కొందరు తాము చేసే వృత్తికి సంబంధించి వెల్డింగ్, సెంట్రింగ్ వంటివి సెలక్ట్  చేసుకున్నారు. అయితే కోరుకున్న యూనిట్​వారికి సెట్​కాదని మరొకటి ఎంచుకోవాలని ఆఫీసర్లు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ బర్రెలు కొనుక్కుని పాల బిజినెస్​చేస్తానని చెప్పగా ఆఫీసర్​భూమి ఉందా అంటూ ప్రశ్నించారు. బర్రెలకు గడ్డి ఎక్కడ నుంచి తెస్తారని అడగడంతో కొనుక్కొచ్చుకుంటామని చెప్పడంతో ఇది నీకు సెట్​కాదు.. వేరే యూనిట్​సెలక్ట్​చేసుకోవాలని సూచించారు. ఓ యువకుడు సెంట్రింగ్​యూనిట్​కావాలని చెప్పగా.. మిగిలిన పైసలతో ఏం చేస్తావని ఆఫీసర్లు అడిగారు. ఆటో కొనుక్కుంటానని యువకుడు చెప్పడంతో ఇదే పని ఇంకొకరు చేస్తనన్నరు.. ఇద్దరికి నడుస్తదా అని ప్రశ్నించారు. పది లక్షలు కలెక్టర్​ఖాతాలోనే ఉంటాయని, ఎక్కడికి పోవని.. మరోసారి ఆలోచించుకోవాలని చెప్పారు. ఇలా ఏదో ఒక కారణంతో యూనిట్ల ఎంపిక కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా ఎక్కువ మంది ఒకే రకమైన యూనిట్లు సెలక్ట్ చేసుకోవడంతో ఆఫీసర్లు డైలమాలో ఉన్నారు. ఈ విషయంలో క్లారిటీ రాగానే చెక్కులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు.

మాతాన పచ్చళ్లు ఎవరు కొంటరు

బర్రెలు కొనుక్కుందామంటే భూమి లేదని అన్నరు. పచ్చళ్లు తయారు చేసి అమ్ముకో మని ఓ ఆఫీసరు చెప్పిండు. ఇప్పటికీ ఎస్సీలమని మమ్ములను దూరంగా పెడుతున్నరు. దుకాణం దగ్గరకు పోతే పైసలు అక్కడ పెట్టమని.. సామాను కూడా మా చేతికి తాకకుండా ఇస్తరు. పనికి పోయినా.. వేరే కులపోళ్లు దూర దూరంగా ఉంటరు.  అట్లాంటిది మా దగ్గర పచ్చళ్లు ఈ ఊర్లో ఎవరు కొంటరు. వేరే ఊరు పోయి అమ్ముకుంటే గిట్టుబాటు అయితదా?
–  మహిళ, వాసాలమర్రి