
ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితోనే భూ సంస్కరణలు అమలవుతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ అన్నారు. మోదీ, షా, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి ప్రజలను మతప్రాదిపకన విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సైతం వక్రీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపుసభలో ఆయన మాట్లాడారు. సాయుధ పోరాట ఫలితంగానే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో భూ సంస్కరణలు అమలయ్యాయని, ఆ తర్వాతే దేశవ్యాప్తంగా విస్తరించాయన్నారు.
మోదీ, షాకు మాత్రమే రక్షణమంత్రిగా వ్యవహరిస్తున్న రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణ పోరాటానికి సైతం మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సాయుధ పోరాట వక్రీకరణ సాధ్యం కాదు : తమ్మినేని
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ సాయుధ పోరాట వక్రీకరణ సాధ్యం కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్ 17ను కొన్ని పార్టీలు విద్రోహ దినం, విలీన దినం, విమోచన దినంగా పేర్కొంటున్నాయని.. ఎవరెలా చెప్పినా సాయుధ పోరాటం ఎర్ర జెండా పోరాటం తప్ప మరేదీ కాదన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే మూడు వేల గ్రామాలకు విముక్తి కలిగిందన్నారు.
సాయుధ పోరాటంపై అసత్య ప్రచారం ఆపాలి : బృందాకారత్
నల్గొండ అర్బన్/సూర్యాపేట, వెలుగు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసత్య ప్రచారం చేస్తున్నారని, దానిని వెంటనే ఆపాలని సీపీఎం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకారత్ అన్నారు..
బుధవారం నల్గొండలో జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆమె మాట్లాడారు. దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వస్తే.. హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వచ్చిందన్నారు. సంవత్సరం పాటు జరిగిన పరిణామాలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య సొంత గ్రామాల్లో పర్యటించి చరిత్రను తెలుసుకోవాలని హితవు పలికారు.
అనంతరం ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవాలు - వక్రీకరణలు’ అనే అంశంపై సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సెమినార్‌కు హాజరయ్యారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో కాషాయ పార్టీకి ఏం సంబంధం ? మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు అని విమర్శించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మచ్చుకైనా కనిపించని వారు.. ఆ పోరాటానికి వారసులం అంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జునరెడ్డి, ఆశలత పాల్గొన్నారు.