
- మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు మెరుగైన సేవలు అందించాలి ..
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మంరూరల్/కూసుమంచి, వెలుగు : విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ‘స్వస్థ నారీ సశక్తి పరివార్’ ప్రోగ్రామ్‌కు పైలట్ మండలంగా ఎంపికైన తిరుమలాయపాలెం హాస్పిటల్ వద్ద బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఆడ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
వైద్యాధికారులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. 30 బెడ్స్‌తో ఉన్న తిరుమలాయపాలెం ఏరియా హాస్పిటల్ 50 పడకలకు అప్‌గ్రేడ్ అయిందన్నారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ... బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని సూచించారు.
ప్రతి మహిళ, చిన్నారులు తప్పనిసరిగా టెస్ట్‌లు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు ఖమ్మం రూరల్ మండలం కైకొండాయిగూడెంలో రూ.3.10 కోట్లతో చేపట్టనున్న అంతర్గత రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాన చేసి, పోషణమాసం 2025 కు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తిరుమలాయపాలెం- – ముల్కలపల్లి హైలెవల్ బ్రిడ్జి అప్రోచ్ రిపేర్లకు సైతం సంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో చందునాయక్, వైద్యాధికారులు కృపా ఉషశ్రీ, శ్రీనివాస్‌రావు, వైదేహి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పాల్గొన్నారు.