కమ్యూనిస్టుల పోరాటంతోనే తెలంగాణ విలీనం : ఏఐటీయూసీ ప్రెసిడెంట్ సీతారామయ్య

కమ్యూనిస్టుల పోరాటంతోనే తెలంగాణ విలీనం : ఏఐటీయూసీ ప్రెసిడెంట్ సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు: కమ్యూనిస్టుల సాయుధ పోరాటంతోనే తెలంగాణ విలీనం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ​ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్​లోని ఏఐటీయూసీ యూనియన్​ఆఫీస్​లో తెలంగాణ పోరాట 77వ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ టౌన్​ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్​తో కలిసి ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్​ పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందన్నారు. 

మూడు వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు. ఈ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఎర్రజెండా రాజ్యం వస్తేనే దేశంలో ప్రజల బతుకులు మారుతాయని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, శఠగోపం కిష్టయ్య, గాజుల మణెమ్మ, సాంబయ్య, గోపీ తదితరులు పాల్గొన్నారు.