స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలి..తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్

స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలి..తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్

పద్మారావునగర్, వెలుగు: స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) డిమాండ్ ​చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆధ్వర్యంలో సంస్థలు స్టైఫండ్ ప్రతిపాదనలు సమర్పించినా.. ఆరోగ్య శాఖలో ఆమోదాలు నిలిచిపోతున్నాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ, డెంటల్ పీజీలు, హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థుల తరఫున జూడా.. స్టైపండ్ల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

సమయానికి చెల్లింపులు జరగకపోవడంతో చాలా మంది డాక్టర్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని వెల్లడించింది. భోజనం, అద్దె, ప్రయాణ ఖర్చులు, పరీక్ష ఫీజులు కూడా చెల్లించలేకపోతూ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంది.  ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రతి నెలా మళ్లీ మళ్లీ ఫాలోఅప్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.