
- ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఇది చాలా గొప్పది: కోదండరాం
- షాద్‌నగర్‌లో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన
షాద్‌నగర్, వెలుగు: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం చాలా గొప్పదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జరిగిన ఈ పోరాటాన్ని మతం కోణంలో చూడొద్దని ప్రొఫెసర్ కోదండరాం కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అమరువీరుల స్తూపానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ విలీనం కులమతాలకు అతీతంగా జరిగిందని, అన్ని వర్గాలు తెలంగాణ కోసం పోరాటం చేశాయన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పోరాట యోధులని అన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతకూడా నిజాం రాజు తెలంగాణను వీడకపోవడంతో.. ఆయనతో యుద్ధం చేయాల్సి వచ్చిందని కోదండరాం గుర్తు చేశారు. అమరవీరుల సమాధులపై అధికారపు పునాదులు కట్టిన గత ప్రభుత్వం కనీసం వారికి ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. ఆనాడు ఉద్యమకారులు నడుంకట్టకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. జనవరి 26 నాటికి ఈ స్తూపాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్‌అలీ ఖాన్ బాబర్, రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి తదితరులున్నారు.