హుజురాబాద్ లో దళితులు ఓటు నమోదు చేసుకుని దళితబంధు అడగండి

హుజురాబాద్ లో దళితులు ఓటు నమోదు చేసుకుని దళితబంధు అడగండి

కేసీఆర్ పాలనలో రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో నాలుగింతలు నిరుద్యోగం పెరిగిందన్నారు. ఖాళీలు ఉన్నా ఉద్యోగాలు భర్తీ చెయ్యడం లేదన్నారు. ఆయన ఇంట్లో మాత్రం ఐదు ఉద్యోగాలు ఉన్నాయన్నారు.


కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో ఇవాళ వైస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. దీక్ష ముగిసిన తర్వాత మాట్లాడిన ఆమె.. ‘ఏడేళ్లలో ఏం సాధించాం.. ఉద్యమ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారు’ అన్నది కేసీఆరే కదా.. మరి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు షర్మిల.


హుజురాబాద్‌లో ఎన్నికలు ఎందుకు వచ్చాయి. ఈ ఎన్నికలు ప్రజల కోసమా? వాళ్ళ బలాలు నిరూపించుకోవడం కోసమా? టీఆర్ఎస్ నేతలను నిలదీయండి అని ప్రజలకు సూచించారు షర్మిల. నిద్రపోయారా, గాడిదలు కాశారా అని అడగండన్నారు. ఎంత మంది చచ్చినా కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్ ఏనాడూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదని.. ఎప్పుడు రేటు వస్తుందా, ఎప్పుడు అమ్ముడు పోదామా అని ఆ పార్టీ నేతలు చూస్తారని విమర్శించారు. ఉప ఎన్నిక వస్తేనే దళితులు బంధువులు అయ్యారా? ఓ పథకం ఎన్నిక కోసమే అని చెప్పే సీఎం దేశంలోనే లేడన్నారు. అందరి చేత రాజీనామాలు చేయించాలన్నారు. దళితుల భూములను లాక్కుని  లక్ష కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దళితులకు ఇచ్చేది కేసీఆర్ డబ్బేమీ కాదని.. దళితులకు కేసీఆర్ 51 లక్షలు బాకీ ఉన్నాడన్నారు. ఇప్పుడు ఇచ్చే పది లక్షలు తీసుకోండి. తర్వాత 41 లక్షలు వసూలు చేయండన్నారు. కేసీఆర్‌ను దొర అని, ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటారని అన్నారు. రాష్ట్రంలోని దళితులంతా హుజురాబాద్ రండి.. మీ ఓటు హక్కు ఇక్కడ నమోదు చేసుకోండి... దళితబంధు అడగండి అని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు, చేనేత కార్మికుల భార్యలకు, నిరుద్యోగులకు, రైతులకు, తమ మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన ప్రపంచం అంతా చూడాలన్నారు వైఎస్ షర్మిల.