
- నేల కొరిగిన వరి,మక్కజొన్న నేలరాలిన మామిడి
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో పంటలకు నష్టం
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: మంగళవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పైర్లు దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యమంతా తడిసి ముద్దయింది. రెక్కల కష్టం నీళ్లపాలైందని రైతులు లబోదిబోమంటున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం, టార్పాలిన్లు ఇవ్వకపోవడం వల్ల వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మెదక్ జిల్లాలో..
పాపన్నపేట, చేగుంట, రామాయంపేట, నిజాంపేట, హవేలి ఘనపూర్, కౌడిపల్లి తదితర 14 మండలాల్లో వరిపంట దెబ్బతింది. అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లావ్యాప్తంగా 9,857 మంది రైతులకు చెందిన 13,632 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అత్యధికంగా పాపన్నపేట మండలంలో 2,627 మంది రైతులకు సంబంధించి 3,891 ఎకరాల్లో, చేగుంట మండలంలో 3,400 ఎకరాల్లో, రామాయంపేట లో 1,339 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాట్లింది. చేగుంట మండలంలో 5గురు రైతులకు చెందిన 6 ఎకరాల మక్కజొన్న పంట దెబ్బతింది. చిన్నశంకరంపేట, నార్సింగి, నిజాంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి మండలాల్లో 86 మంది రైతులకు సంబంధించి 204 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి మెదక్ మార్కెట్‌యార్డు, పాపన్నపేట మండలం ముద్దాపూర్, రాంతీర్థం, మండల కేంద్రమైన కొల్చారం, నిజాంపేట మండలం నందిగామ, కౌడిపల్లి మండలం భుజరంపేటలో కొనుగోలు కేంద్రాలు జలమయమయ్యాయి.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కొండాపూర్, సదాశివపేట, కంగ్టి, నాగలిగిద్ద, జహీరాబాద్, మొగుడంపల్లి, మనూర్, నారాయణఖేడ్, కోహిర్ మండలాల్లో వడగళ్ల వర్షం రైతులను ముంచింది. వ్యవసాయ, హార్టికల్చర్ ఆఫీసర్లు బుధవారం సర్వే చేసి 4 వేలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. సంగారెడ్డి, కొండాపూర్, కోహిర్, జహీరాబాద్ మండలాల్లో ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి.
సిద్దిపేట జిల్లాలో..
వడగండ్ల వర్షం సిద్దిపేట జిల్లా రైతాంగానికి కడగండ్లు మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా దాదాపు 46 వేల ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్లలో రైతులకు తీవ్ర పంట నష్టం జరిగింది. బుధవారం పొద్దు పొయ్యే వరకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫీల్డ్‌లో నష్టాన్ని తొగుట మండలం గోవర్ధనగిరిలో భారీ వడగండ్లతో పదివేల కోడి పిల్లలు చనిపోయాయి. చేర్యాల మండలం ఆకునూరులో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.