అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి : దామోదర రాజనర్సింహా

అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి : దామోదర రాజనర్సింహా

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ క్వారీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర  వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తో కలిసి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అక్రమ మైనింగ్ జరగకుండా మైనింగ్, రెవెన్యూ ,పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

ఇప్పటివరకు సేకరించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే అన్నారు. జల వనరులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఇరిగేషన్​అధికారులకు సూచించారు. జోగిపేట -అకోలా జాతీయ రహదారి 161 పై చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, అండర్ పాస్ లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్డు భద్రతా చర్యలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలో కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు ఉన్నాయన్నారు.  వైద్యులు, సిబ్బంది ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మెడికల్ కాలేజ్​భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని, సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి, అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అడిషనల్​ఎస్పీ అశోక్, ఆయా శాఖల  అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.