ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్​టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: దండారీ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్​జిల్లాలోని వాన్వట్, దార్ లొద్ది​ గ్రామాల్లో జరిగిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ పాల్గొన్నారు. ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్ ఆధినాథ్, ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.  సిర్పూర్​(యు) మండలం పిట్టగూడలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోలాటం ఆడి నృత్యం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవత్ రావు, సింగల్ విండో చైర్మన్ శివాజీ, వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్, సర్పంచ్ కోవా నాందేవ్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అసమవల్లే మెడికల్​కాలేజీకి పర్మిషన్​రాలే

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, ప్రభుత్వ యంత్రాంగం అసమర్థత కారణంగానే మెడికల్​ కాలేజీకి ఎన్​ఎంసీ పర్మిషన్​ రాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. మంగళవారం ఆయన పార్టీ జిల్లా ఆఫీసులో ప్రెస్​మీట్ ఏర్పాటు చేశారు. రాష్ర్టవ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలు మంజూరు కాగా ఏడింటికి అనుమతి వచ్చి కేవలం మంచిర్యాల మెడికల్ కాలేజీకి రాకపోవడం ఎవరి తప్పిదమో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. ఈ విద్యా సంవత్సరం కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు మంచిర్యాల మెడికల్​ కాలేజీ ఆప్షన్ ఇద్దామనుకుంటే అందులో ఈ పేరు లేదన్నారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే దివాకర్​రావు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే ఇతర జిల్లాల్లోని వరద బాధితులకు రూ.10వేల చొప్పున సాయం అందించి మంచిర్యాలలో కేవలం రూ.3,800 ఇవ్వడం ఎమ్మెల్యే చేతగానితనమని విమర్శించారు. సీఎం కేసీఆర్​ దగ్గరికి వెళ్లి వరద బాధితులను అదుకోమని అడిగే దమ్ము ధైర్యం లేదన్నారు. ముంపు బాధిత కుటుంబాలకు వెంటనే రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్​ చేశారు. నాయకులు వంగపల్లి వెంకటేశ్వర్​రావు, రజీనిష్ జైన్, తుల ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేశ్​ పాల్గొన్నారు. 

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: ఏఐటీయూసీ 

బెల్లంపల్లి,వెలుగు: కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ చట్టాలనుప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు ఆరోపించారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడో మహాసభ వాల్ పోస్టర్​ను ఆయన రిలీజ్​ చేశారు.​ మహాసభలు మహబూబ్ నగర్ లో ఈ నెల 28న జరుగుతాయన్నారు. కార్మికులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ లీడర్ చిప్ప నరసయ్య, బెల్లంపల్లి ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్తూరి శంకర్, రంగ ప్రశాంత్, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇన్​చార్జి చేర్ల అనిల్​ తదితరులు పాల్గొన్నారు.

ఫిజికల్ ​ఫిట్​నెస్​పై ఫ్రీ కోచింగ్​

మందమర్రి,వెలుగు: పోలీసు​ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్​నెస్​పై సింగరేణి ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్​ఇవ్వనున్నట్లు మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల పాటు స్థానిక హైస్కూల్​ గ్రౌండ్​లో సింగరేణి,  మాజీ ఉద్యోగుల పిల్లలు, భూ నిర్వాసితులు, పరిసర గ్రామాల నిరుద్యోగ పిల్లలకు కోచింగ్​ఇస్తామన్నారు. ఈనెల 29లోపు అభ్యర్థులు తమ పూర్తి వివరాలు జీఎం ఆఫీస్​ పర్సనల్ డిపార్ట్​మెంట్​లో నమోదు చేసుకోవాలన్నారు.

కుమ్రంభీం ఆశయ సాధనకు కృషి

ఆదిలాబాద్ టౌన్​,వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. మంగళవారం గాదిగూడ మండలం దాబా గ్రామంలో ఆదివాసీలు నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. దేశంలోనే అత్యున్నతమైన పదవిలో ఒకటైన రాష్ట్రపతి పదవిని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు ఇచ్చిందన్నారు. గుసాడీ నృత్యాన్ని చైతన్య పరచడంలో ప్రధాన పాత్ర పోషించిన కనకరాజుకు పద్మశ్రీ గౌరవించిందన్నారు. 

మూడ్రోజులైనా దొరకని ఆచూకీ

చెన్నూర్​, వెలుగు: కోటపల్లి మండలం ఎర్రాయిపేట గోదావరిలో గల్లంతైన ప్రైవేట్​ టీచర్​ టోనీ ఆచూకీ మూడ్రోజులైనా దొరకలేదు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నూర్​లోని అసీసీ హైస్కూల్​లో కేరళకు చెందిన టోనీ, మోజో టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరు మరో ఇద్దరితో కలిసి ఆదివారం ఎర్రాయిపేట గోదావరిలో సరదాగా స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో టోనీ, మోజో నీటమునిగి గల్లంతయ్యారు. మోజో మృతదేహం సోమవారం దొరికింది. చెన్నూర్​ హాస్పిటల్​లో పోస్టుమార్టం నిర్వహించి కేరళకు పంపించారు. టోనీ ఆచూకీ కోసం మూడ్రోజులుగా పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న మయూరి అనే పేద మహిళకు వైద్య ఖర్చుల కోసం దుర్గం పోశం చారిటబుల్​ ట్రస్ట్​ చైర్మన్​ దుర్గం రాజేశ్​​ మంగళవారం ఆర్థికసాయం అందించారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్ , ముడిమడుగుల మల్లయ్య, మహేష్ పాల్గొన్నారు.

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

కుభీరు,వెలుగు: కుభీర్ కు చెందిన ప్రశాంత్(33) మద్యానికి బానిసై మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు
 ఎస్సై ఎండీ షరీఫ్​తెలిపారు. అతను గతంలో గ్రామపంచాయతీ వర్కర్ గా పనిచేసినట్లు వివరించారు. విధులను విస్మరించడంతో ఇటీవల ఆఫీసర్లు అతడిని డ్యూటీ నుంచి తొలగించారన్నారు. దీంతో ఆయన మద్యానికి బానిసయ్యాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి

నార్నూర్,వెలుగు: ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు కాపాడాలని దివ్యశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ కోరారు. గాదిగూడ మండలంలోని సాంగ్వి గ్రామంలో ఏర్పాటు చేసిన దండాడీ ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుస్సాడీ బృందంతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. పెద్దలు అర్క నాగోరావ్, తుకారాం, రాము ఫౌండేషన్ సభ్యులు గాయక్వాడ్, మారుతి, పవన్  తదితరులు ఉన్నారు.

యువకుడిపై జడ్పీటీసీ భర్త దాడి

జైపూర్,వెలుగు: జైపూర్ మండలంలోని షెట్ పల్లి సర్పంచ్ రవి నాలుగు రోజుల క్రితం పంచాయతీ ఆఫీస్​లో లిక్కర్​తాగి అక్కడ నిద్రపోయాడు. స్థానికులు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గ్రామానికి చెందిన రమేశ్​సోషల్ మీడియాలో వైరల్ చేశాడనే అనుమానంతో స్థానిక జడ్పీటీసీ భర్త మేడి తిరుపతి ఇంటికి పిలిపించి బెదిరించాడని రమేశ్​ఆరోపించారు. దీనిపై రమేశ్​భార్య లక్ష్మి స్థానిక సర్పంచ్​రవి, జడ్పీటీసీ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. 

కబడ్డీ విజేత మంచిర్యాల జట్టు

కాగజ్ నగర్,వెలుగు: కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి. టోర్నీలో 35 జట్లు పాల్గొనగా మంచిర్యాల  జట్టు మొదటి బహుమతి, వీర్దండి జట్టు రెండో బహుమతి దక్కించుకున్నాయి. వైగాం జట్టు మూడో స్థానంలో నిలిచింది. విజేతలకు కౌటాల ఎస్సై ప్రవీణ్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వసంత్ రావు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ రాందాస్ పాల్గొన్నారు.

ఘనంగా దీపావళి వేడుకలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవికి పూజలుచేసి పటాకలు కాల్చారు. ఆదిలాబాద్​లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్​రెడ్డి, మున్సిపల్ చైర్మన్​ జోగు ప్రేమేందర్​తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ శివారులోని గండిరామన్న సాయిబాబా ఆలయ  ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. ఆలయ సింగిల్ ట్రస్టీ లక్కడి జగన్మోహన్ రెడ్డి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప్పుల నందు, సోమేశ్, రేఖ, కళ్యాణి, సాయి వైష్ణవి, సాయి కీర్తి తదితరులు పాల్గొన్నారు.

- ఆదిలాబాద్​టౌన్/నిర్మల్​,వెలుగు