Gujarat Rains: గుజరాత్లో భారీ వర్షాలు.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..

Gujarat Rains: గుజరాత్లో భారీ వర్షాలు.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని  ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. డాంగ్ జిల్లాలో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నర్మదా నదికి ఉప నది అయిన అంబికా నది వరద నీటితో పొంగిపొర్లుతోంది. అంబికా నదికి వరద ఉధృతి అంతకంతకూ పెరిగి సపుతరలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. సపుతరలో వరద ప్రవాహంలో ఒక లారీ చిక్కుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది.

 

వల్సాద్ జిల్లాలోని వాపిలో కూడా వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇవాళ ఉదయం కూడా వాపిలో కుండపోత వర్షం కురిసింది. గుజరాత్ కు మరో ఐదు రోజులు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా గుజరాత్ను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఆరావళి, మహిసాగర్, నర్మద, బరౌచ్, డాంగ్, కుచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సూరత్, నవ్సరి, వల్సాద్, డామన్, దాద్రా నగర్ హవేలీ, భావ్ నగర్ ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నవ్సరి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.