నానో టెక్నాలజీ రైతులకు వరం : డీఏవో దేవ్ కుమార్

నానో టెక్నాలజీ రైతులకు వరం : డీఏవో దేవ్ కుమార్

రామాయంపేట, నిజాంపేట, వెలుగు: రైతులకు నానో టెక్నాలజీ వరంలాంటిదని డీఏవో దేవ్​కుమార్​అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని దామరచెరువు గ్రామ శివారులో శ్రీధర్‌రావు పొలంలో నానో యూరియా,  డ్రోన్ పిచికారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ యూరియాలో కేవలం 30 శాతం నత్రజని మాత్రమే పంటకు అందుతుందన్నారు. 

మిగతా పోషకాలు నీటిలో కలిసిపోవడం లేదా గాలికి ఆవిరైపోవడం వల్ల రైతులు ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాల్సి వస్తుందన్నారు. అర లీటర్ నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమని దీని వాడకం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు రాజ నారాయణ, శ్రీనివాస్, ప్రవీణ్, ఇఫ్కో ప్రతినిధి చంద్రబాబు నాయుడు, సొసైట్ సీఈవో నర్సింలు పాల్గొన్నారు. 

నిజాంపేట్  మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో దొంతినేని రేణుక రావు పది ఎకరాల వరి పొలంలో డ్రోన్ ద్వారా నానో యూరియాను స్ప్రే చేయించారు. ఏవో సోమలింగారెడ్డి  స్ప్రే విధానాన్ని పరిశీలించారు. రేణుక రావు మాట్లాడుతూ తన భర్తకు  నానో టెక్నాలజీ పై అవగాహన ఉండడం వల్ల పొలంలో మొత్తం నానో యూరియాను వాడుతున్నామన్నారు.