గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే శక్తుల పట్ల అలర్ట్ గా: ధరావత్ రవీంద్రనాయక్

గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే శక్తుల పట్ల అలర్ట్ గా: ధరావత్ రవీంద్రనాయక్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో గోండు, కోయ, లంబాడీ గిరిజన తెగల మధ్య జరుగుతున్న వివాదాలు, విద్వేష ప్రచారాలపై బంజారా భారత్ జాతీయ అధ్యక్షుడు ధరావత్ రవీంద్రనాయక్  ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన లంబాడీలపై జరుగుతున్న విషప్రచారంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల మధ్య చిచ్చుపెడుతున్న విద్రోహ శక్తులు, గిరిజనేతర దళారుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం గోండు, కోయ, లంబాడీ, ఎరుకల అందరూ షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) కిందకే వస్తారని రవీంద్రనాయక్ స్పష్టం చేశారు.

లంబాడీలు ఎస్టీలుగా గుర్తింపు పొందిన తర్వాతే రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెరగడానికి మార్గం సుగమమైందని గుర్తుచేశారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం, గిరిజన ప్రాంతాల్లో భూములు ఆక్రమించిన అక్రమార్కుల ప్రలోభాలకు లొంగి కొందరు గోండు, కోయలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. లంబాడీలను వలసవాదులని, ఎస్టీలు కారని దుష్ప్రచారం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. నిజాం కాలం నాటి గెజిట్, 1976 పార్లమెంటు చట్టం ప్రకారమే లంబాడీలు ఎస్టీలుగా గుర్తింపు పొందారన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే బదులు, రిజర్వేషన్లలో ఇంకా అమలుకాని వాటాలను సాధించాలని పిలుపునిచ్చారు.