- కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే దొంగల బీభత్సం
- అడ్డుకోబోయిన సిబ్బందిపై పిస్టల్స్‌తో కాల్పులు
- షాప్ మేనేజర్ ముస్తాక్ అలీ, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్, జిల్లా జడ్జి ఇంటికి దగ్గర్లోనే భారీ చోరీ.. పల్సర్,అపాచీ బైక్‌లపై పరార్
- ఐదుగురు దొంగల కోసం ముమ్మరంగా గాలింపు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైఅలర్ట్
- దొంగల సమాచారం ఇచ్చినోళ్లకు రూ.లక్ష రివార్డు ప్రకటన
కరీంనగర్/కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ సిటీలోని పీఎంజే జ్యువెలరీ షాపులో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పిస్టల్స్‌తో వచ్చిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకుపైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పుల్లో షాపు సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ తీవ్రంగా గాయపడ్డారు. షాపులోకి ఎంటరైన ఐదు నిమిషాల్లోనే పని ముగించుకున్న దొంగలు.. బయటికి పరుగెత్తి పల్సర్, అపాచీ బైక్ లపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు పది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ ఆఫీస్, జిల్లా జడ్జి ఇంటికి సమీపంలోనే సినీ ఫక్కీలో భారీ చోరీ జరగడంతో తీవ్ర కలకలం రేగింది. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం షాపు వద్దకు చేరుకుని దోపిడీ జరిగిన తీరును తెలుసుకున్నారు. దొంగల్లో ఒకడు ముఖానికి మాస్క్ పెట్టుకుని గుర్తు పట్టలేకుండ ఉండగా.. మిగతా నలుగురు మాత్రం ఎలాంటి మాస్కులు లేకుండానే దోపిడీకి పాల్పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు దొంగల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. పారిపోయిన దొంగల సమాచారం ఇచ్చినవాళ్లకు రూ.లక్ష రివార్డును ప్రకటించారు.
ఐదు నిమిషాల్లోనే..
పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ కోసం ఐదుగురు దొంగలు ఆదివారం ఉదయం11.06 గంటలకు షాపు సమీపంలోకి చేరుకున్నారు. అప్పటికి సిబ్బంది తప్ప కస్టమర్లు ఎవరూ లేరు. దొంగల్లో ఒకడు మొదట లోపలికి వెళ్లి 20 గ్రాముల గోల్డ్ చైన్ చూపాలని అడిగాడు. ఆ వెనకాలే మరో ఇద్దరు రాగా.. సెక్యూరిటీ గార్డు వారిని వివరాలు అడిగి లోపలికి పంపాడు. వారికి సిబ్బంది బంగారు ఆభరణాలు చూపిస్తుండగానే మరో ఇద్దరు లోపలికి ఎంట్రీ అయి ఒక్కసారిగా అటాక్ అని పెద్దగా అరిచారు.
వారిలో ఒకరు సెక్యూరిటీ గార్డును పిస్టల్ తో బెదిరిస్తూ చేతులను పట్టుకుని మోకాళ్లపై కూర్చోబెట్టగా.. ఇంకొక దొంగ పక్కనే ఉన్న మరో ఉద్యోగిని కూడా పిస్టల్ తో బెదిరించి రెండు చేతులు ఎత్తమని చెప్పి పక్కన కూర్చోబెట్టాడు. ఆ వెంటనే మిగతా ముగ్గురు దొంగలు కూడా తమ ప్యాంట్ జేబులు, బ్యాగుల్లో ఉన్న పిస్టల్స్ తీసి షాపులోని ఇతర సిబ్బందిని బెదిరించి అందరిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇదంతా ఒక నిమిషంలోనే జరిగిపోయింది. ఆ తర్వాత ఇద్దరు దొంగలు బంగారు ఆభరణాలను తమ బ్యాగుల్లో వేసుకుంటుండగా.. మరో ముగ్గురు సిబ్బందిని బెదిరించారు.
ఇద్దరు మహిళలను తాళ్లతో కట్టేయడంతోపాటు నోటికి ప్లాస్టర్ వేశారు. ఈ క్రమంలోనే సరిగ్గా11.11 గంటల సమయంలో మేనేజర్ ముస్తాక్ అలీ,సెక్యూరిటీ గార్డు, ఇద్దరు సిబ్బంది మాట్లాడుకోవడం చూసిన ఒక దొంగ.. ఏం మాట్లాడతున్నారంటూ పిస్టల్ చూపించి, కాలితో తన్నబోయాడు. దీంతో మేనేజర్ తోపాటు మిగతా ముగ్గురు ఒక్కసారిగా పైకిలేచి దొంగలపై ఎదురుదాడికి దిగారు. దీంతో దొంగలు పిస్టల్స్ తో కాల్పులు జరుపుతూ సెకన్ల వ్యవధిలో బంగారంతో బయటికి పరుగులు తీశారు. అంతా ఐదు నిమిషాల వ్యవధిలోనే దోపిడీ పూర్తి చేసుకుని పల్సర్, అపాచీ బైక్ లపై పరారయ్యారు.
సిబ్బందికి తప్పిన ప్రాణాపాయం..
షాపు సిబ్బంది ధైర్యంగా దొంగలను అడ్డుకున్నారు. వారు జరిపిన కాల్పుల్లో మేనేజర్ ముస్తాక్ తలకు బుల్లెట్ గాయమవ్వగా.. కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేశ్ కు భుజం, కడుపు భాగాల్లో బుల్లెట్ గాయాలయ్యాయి. వీరికి తీవ్ర గాయాలు అయ్యాయని, కానీ ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న బాధితులను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మల్టీ జోన్1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ గౌస్ ఆలం పరామర్శించారు.
బండి సంజయ్ వెళ్లిన పది నిమిషాలకే..
కాల్పుల ఘటన జరగడానికి పది నిమిషాలకు ముందే షాపు సమీపంలోని జ్యోతినగర్ లో సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేసి వెళ్లారు. కేంద్ర మంత్రి వెళ్లిన కొద్ది సేపటికే ఈ ఘటన జరగడంతో కలకలం రేగింది. శనివారం రాత్రి స్వయంగా సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో కరీంనగర్ సిటీలో నాకాబందీ నిర్వహించారు. కానీ మరునాటి ఉదయమే ఈ ఘటన జరగడంతో పోలీసులు షాక్ అయ్యారు.
దోపిడీ జరిగిన పది నిమిషాలకే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ గౌస్ ఆలం క్లూస్ టీమ్ తో చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బందిని ఆరా తీశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా జ్యువెలరీ షాపును పరిశీలించారు.
సమాచారమిస్తే రూ.లక్ష రివార్డు..
పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడిన దొంగల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారమివ్వాలని ఆయన కోరారు. దొంగలు బ్లాక్ కలర్ పల్సర్ బైక్, వైట్ కలర్ అపాచీ బైక్ లపై తిరుగుతున్నారని తెలిపారు. వారు కనిపిస్తే డయల్100కు లేదా 8712670744, 8712670745 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
సిరిసిల్ల వైపు పరార్..
సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం దొంగలు చింతకుంట దాటి సిరిసిల్లవైపు పరారైనట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. చింతకుంట మీదుగా అపాచీపై బైక్ ఇద్దరు, పల్సర్ బైక్ పై ముగ్గురు వెళ్తున్నట్లు ఆ ఏరియాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో సిరిసిల్ల పోలీసులతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగల్లో ఒకడు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడినట్లు షాపు సిబ్బంది తెలిపారు.
మిగతా వారు హిందీలోనే మాట్లాడారు. దీన్ని బట్టి దొంగలు ఇతర రాష్ట్రాలకు చెందినవారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సంఘటన స్థలంలో ఒక పిస్టల్ మ్యాగజైన్, బుల్లెట్ షెల్స్ లభించాయి. వీటిని బట్టి పిస్టల్స్ కంట్రీ మేడా? అక్రమంగా కొనుగోలు చేసినవా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
