
- విస్తరణ పనుల వల్లే భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు: ఆది శ్రీనివాస్
వేములవాడ/హైదరాబాద్, వెలుగు: వేములవాడలోని రాజన్న ఆలయాన్ని బంద్ పెట్టామంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికీ ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ‘‘ఆలయంలో విస్తరణ పనులు జరుగుతున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. వారి విశ్వాసాలకు అనుగుణంగానే భీమేశ్వర ఆలయంలో దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిని రాజకీయం చేయడం తగదు..’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.
భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా రూ.150 కోట్లతో గుడిలో అభివృద్ధి పనులు చేపడ్తున్నామన్నారు. ఇప్పటికే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. విస్తరణ సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వరాలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఆది శ్రీనివాస్ వెంట ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ తదితరులు ఉన్నారు.
దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్న: శైలజా రామయ్యర్
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ విస్తరణ, నిర్మాణ పనుల నేపథ్యంలో భక్తుల అభీష్టానికి అనుగుణంగా ఎల్ఈడీ స్క్రీన్లపై తాత్కాలిక ఏర్పాట్లతో స్వామి దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్జిత సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మేడారం జాతర సమయంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు, తర్వాత తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఈ తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు అని పేర్కొన్నారు.