సంగీతం, సాహిత్యంతో ఆకట్టుకుంటున్న "దర్శన "

సంగీతం, సాహిత్యంతో ఆకట్టుకుంటున్న "దర్శన "

దర్శన.. సౌత్ ఇండస్ట్రీలో లెటెస్ట్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్. కాలేజ్ ఫంక్షనైనా.. పెళ్లి మండపమైనా ఈ పాట మారుమోగాల్సిందే. యువత మనసు అంతగా కొల్లగొట్టి వారి ప్లేలిస్ట్ లో చేరిపోయింది. ఒక్కసారి ఈ పాట విన్నారంటే లూప్ మోడ్ లో  ప్లే అవుతూ ఉండాల్సిందే.  ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటించిన మలయాళ చిత్రం హృదయంలోనిది దర్శన పాట. 2021లో రిలీజైన ఈ సాంగ్  సినిమా హిట్ అయ్యేందుకు కారణమైంది. 2021 అక్టోబర్లో సాంగ్ రిలీజ్ కాగా.. ఇప్పటికి 75 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 

ప్రేయసిని ఊహించుకుంటూ..
అరుణ్ అలాట్ రాసిన దర్శన సాంగ్కు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అంతేకాదు సింగర్ దర్శన రాజేంద్రన్తో కలిసి పాడారు. దర్శకుడు వినీత్ ఊహలోంచి ఈ పాట పుట్టింది. సినిమాలోని ప్రధాన పాత్ర పేరైన దర్శన అనే పదం పాటలో ఉండాలని వినీత్ పట్టుబట్టడంతో హేషమ్ ఆ సాంగ్  కంపోజ్ చేశారట. ఓ యువకుడు ప్రేమసిని ఊహించుకుంటూ పాడే ఈ పాట ప్రతి పదం ప్రేమలోని స్వచ్ఛతను నిదర్శనంగా నిలుస్తుంది. 

తెలుగులో 2 మిలియన్ల వ్యూస్ 
మలయాళంలో సూపర్ హిట్టైన దర్శన సాంగ్ ఇటీవలే తెలుగులో రిలీజైంది. అలరాజు సాహిత్యం అందించిన ఈ పాటకు సరిగమప 2020 విజేత యశస్వి కొండేపూడి సంగీతం సమకూర్చడంతో పాటు పాడారు. యశస్వి సోదరి సంకీర్తన కొండేపూడి ఆయనతో శృతి కలిపారు. తెలుగులో ఈ పాటకు మూడు వారాల్లో 2మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

క్లాసిక్ మెలోడీకి యూత్ ఫిదా
క్లాసికల్ మెలోడీ అయిన దర్శన సాంగ్కు యువతలో అంత క్రేజ్ రావడానికి సంగీతంతో పాటు సాహిత్యం కూడా కారణమే. బాధలో ఉన్నవారికి ఉపశమనం కలిగించి మనసును ఉత్సాహపరిచేలా ఉన్న లిరిక్స్ యూత్ బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే ఇప్పుడు ప్రతి అమ్మాయి, అబ్బాయి ప్లే లిస్టులో దర్శన సాంగ్ చేరిపోయింది.