Dasara Special 2025: నాలుగో రోజు కాత్యాయని దేవి రూపం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

Dasara Special 2025:  నాలుగో రోజు కాత్యాయని దేవి రూపం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  నాలుగో రోజు ( సెప్టెంబర్​ 25) అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.  కాత్యాయని దేవి ప్రాశస్త్యం.. విశిష్టత గురించి తెలుసుకుందాం. . . 

దసరా  నవరాత్రి ఉత్సవాల్లో  నాలుగో రోజు ( సెప్టెంబర్​ 25) అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో అనుగ్రహిస్తారు. నాలుగు భుజాలతో .. ఖడ్గం.. పద్మం ధరించి.. వరద అభయ హస్తాలతో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.  కాత్యాయని దేవి దివ్య తేజస్సుతో.. బంగారు వర్ణంలో మెరిసిపోతూ భక్తులకు ఆశీర్వదిస్తారు.  

 కాత్యాయని దేవి గురించి..

పూర్వకాలంలో కతు మహర్షి అమ్మవారి దర్శనం కోసం ఘోరంగా.. కఠోరమైన తపస్సు చేస్తాడు.   కతుని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగింది.  అలా అమ్మవారు ఆశ్వయుజ మాసం.. శుక్ష పక్షంలో చవితి రోజున కాత్యాయని దేవి రూపంలో దర్శమిచ్చిందని స్కంధ పురాణం ద్వారా తెలుస్తుంది.  అలా దర్శనమిచ్చిన అమ్మవారిని  కతు మహర్షి .. ఆ తల్లిని తన ఇంట జన్మించి.. తన వంశాన్ని పునీతం చేయాల్సిందిగా ప్రార్థిస్తాడు. 

 అమ్మవారి అనుగ్రహం తప్ప మరే కోరికా లేని కతుడు… ‘నీవు నా ఇంట జన్మించి.. మా వంశాన్ని పునీతం చేయమ’ని కోరుకుంటాడు.  అలా కాత్యాయని అమ్మవారు లోక ప్రసిద్ది  పొందింది .  కాత్యాయని అంటే  తేజ స్వరూపిణి.. మహాతేజో పుంజం .. అని అర్దాలున్నాయి.  తేజస్సు అంటే.. ఙ్ఞానం.. బుద్ది.. అంటే కాత్యాయని అమ్మవారు..తెలివితేటలకు ప్రతీక అని పండితులు చెబుతున్నారు. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థకామమోక్షాలకు అధికారిణి ఈమె.

పార్వతీదేవే .. కాత్యాయని అమ్మవారు అని  అమరకోశంలో రుషులు పేర్కొన్నారు.  ఇంకా  దుర్గాదేవే.. కాత్యాయని’ అని  మహర్షులు అభివర్ణించారు. శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా పరిగణిస్తారు. మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతున్నది. 

మార్కండేయ పురాణం, దేవీ భాగవతం కాత్యాయని ప్రాశస్త్యం గురించి ప్రస్తావించాయి. బౌద్ధ, జైన వాఙ్మయంలోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయి. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది కాత్యాయని అమ్మవారు. 

కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నంద గోప సుతం దేవిం పతియే కురుతే నమః॥ 

అని ధ్యానిస్తూ కాత్యాయనీ దేవిని ఉపాసిస్తారు. ఆ తల్లి అనుగ్రహంతోనే గోపికలంతా శ్రీకృష్ణుడి అనురాగం పొందారని భాగవతం పేర్కొన్నది. కాత్యాయని ఆరాధన వల్ల ఉత్తమ సంతానం, కుటుంబవృద్ధి, సౌభాగ్యం, సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.