Dasara 2025: దుర్గాదేవి తొమ్మిది దివ్య రూపాలు..విశిష్టత.. పూజా ఫలితం ఇదే..!

Dasara 2025:   దుర్గాదేవి తొమ్మిది దివ్య రూపాలు..విశిష్టత.. పూజా ఫలితం ఇదే..!

దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  ఆశ్వయుజమాసం పాడ్యమి నుంచి తొమ్మదిరోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. తొమ్మిది రూపాల్లో  అమ్మవారిని ఎలా పూజించాలి.. శారదీయ  నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేకత ఏమిటి.. దుర్గాదేవి  తొమ్మిది దివ్య రూపాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

ఆశ్వయుజమాసంలో జరిగే శారదా  నవరాత్రి ఉత్సవాల్లో  దుర్గాదేవిని పూజిస్తారు.  అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆవాహన చేసి పూజిస్తారు.  ఇలా పూజించడం వల్ల ధైర్యం.. శక్తి లభిస్తాయని పండితులు చెబుతున్నారు.  చెడు ఆలోచనలు తొలగి.. మంచి ఆలోచనలు వృద్ది చెంది .. జీవితంలో విజయాన్ని సాధిస్తారని పండితులు చెబుతున్నారు. 
ఈ సంవత్సరం ( 2025)   రెండు చతుర్థి తిథిలు నాల్గవ రోజు న వస్తాయి. ఈసారి, దుర్గాదేవి ఏనుగుపై స్వారీ చేస్తుంది. 

దుర్గాదేవి తొమ్మిది దివ్య రూపాలు

 శైలపుత్రి దేవి:  నవరాత్రి ఉత్సవాలు  శైలపుత్రి దేవి ఆరాధనతో ప్రారంభమవుతుంది.అమ్మవారు హిమవంతుడు పర్వతరాజు కుమార్తె కనుక, ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు. తల్లి శైలిపుత్రి  అమ్మవారిని పూజించడం వలన భక్తులకు ఆత్మవిశ్వాసం, శాంతి, శక్తి లభిస్తాయి.ఈ అవతారంలో ఉన్న అమ్మవారు  తెలుపు రంగు శాంతి, పవిత్రత, కొత్త ఆరంభం ప్రతీకగా నిలుస్తుంది.  తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
శైలపుత్రి దేవి పూజ ద్వారా మన జీవితానికి కొత్త ఆరంభం, దైర్యం, స్థిరత్వం లభిస్తాయి. ప్రతి మహిళలోను శైలపుత్రి దేవిలా దైర్యం, సహనం, శక్తి నింపుకోవాలి.అమ్మవారి ఆరాధనతో మనలోని స్త్రీ శక్తి వెలుగులు మరింత బలపడాలి.

 బ్రహ్మచారిణి దేవి:    ఈ అవతారంలో దుర్గాదేవి అమ్మవారు   బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది.  క్రమశిక్షణ...  ధ్యానానికి ప్రతిరూపంగా అమ్మవారిని కొలుస్తారు.  తెల్లని చీర దాల్చి , కుడి  చేతిలో జప మాల.. .. కమండలం , ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మ  అంటే అన్నీ తెలిసినది అని అర్థం.  బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ స్వరూపం ఇలా బ్రహ్మ అంటే అన్నీ అనే అర్థాన్ని నింపుకుని అన్ని తనలోనే నింపుకున్నది అని కూడా అర్థం. చారిణి అంటే కదలడం , ఒక పనిలో నిమగ్నమవడం.  బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్ధం. వచనంలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే పెళ్లి కాని యువతి అని అర్థం.  బ్రహ్మచారిణీ దేవి బుద్దిని, శక్తిని ప్రసాదిస్తుంది. సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను చేకూరుస్తుంది .

 చంద్రఘంట దేవి:   కొత్త బంధాలు ..  భక్తికి చిహ్నంగా ఈ అవాతారం గల అమ్మవారిని పూజిస్తారు.  అమ్మవారు  నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. తను ధైర్యసాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని అధిరోహించింది. ఈ మాతకు పది చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం పువ్వు.. మరో చేతిలో కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గద, బాణం, జపమాల ఉంటాయి. ఈ తల్లి రూపం వైవాహిక జీవిత ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కొత్తగా పెళ్లైన స్త్రీ కొత్త సంబంధాలు మరియు బాధ్యతలను స్వీకరించడాన్ని సూచిస్తుంది.

కూష్మాండ దేవి : కూష్మాండ అంటే..కు... అంటే చిన్నది.. ఊష్మ   అంటే శక్తి... అండా...  అంటే విశ్వం. అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది.  ఈ అవతారం (సృష్టి దేవత) మాతృత్వాన్ని సూచిస్తుంది. స్త్రీ గర్భం దాల్చి జీవితాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉన్న స్థితిని ఆమె సూచిస్తుంది.దసరా నవరాత్రి ఉత్సవాల్లో శుద్ధ చవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు. కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపమశనం లభించడంతో పాటు సమాజంలో కీర్తి, బలం, సంపదలన్నీ పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.పురాణాల ప్రకారం, కూష్మాండ దేవికి మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి. ఈ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనస్సు, బాణాలు, ఒక తేనే భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారు సింహ వాహనంపై భూమి మీదకు వస్తారు.

 స్కందమాత దేవి:  ఈ అవతారం ప్రేమ..  పోషణ  స్వరూపంగా భావిస్తారు.  ఈ రూపం   మాతృత్వం  సంపూర్ణతను సూచిస్తుంది.   ఒక స్త్రీ తన పిల్లలకు జన్మస్థలంగా మారుతుంది.   ప్రేమ, త్యాగం ..  రక్షణగా ర్తీభవిస్తుంది. స్కందమాత అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల పుడతారని పురాణంలో పేర్కొన్నారు. స్కంద అంటే కార్తీకేయుడు. ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తీకేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కంద మాత అనే పేరు వచ్చింది. కాశీ ఖండం, దేవీ పురాణం, స్కంద పురాణాలలో ఈ దేవి గురించి ప్రస్తావించబడింది. . తల్లి స్కందమాతను గౌరీ, మహేశ్వరి, పార్వతీ, ఉమ అని కూడా పిలుస్తారు. ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశు రూపం ఉంటుంది. మరో చేతిలో అభయ ముద్ర ఉంటుంది. ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన రెండు చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి.

 కాత్యాయణి దేవి : దుర్గా దేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయనీ మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాత్యాయనీ మాత గురు గ్రహాన్ని పరిపాలిస్తుంది. గురువు గ్రహాన్ని తెలివితేటలకు, ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు. అందుకే కాత్యాయనీ దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, సకల జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. మరీ ముఖ్యంగా నవరాత్రుల్లో పెళ్లి కాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయనీ మాతను పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచారం పాటిస్తారు.. మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు. అందుకే ఈ అమ్మవారిని మహిషాసురమర్దిని అని పిలుస్తారు. ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది. కాత్యాయనీ దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలా మంది నమ్ముతారు

 కాళరాత్రి  దేవి :  ఈ రూపంలో అమ్మవారు ఉగ్ర స్వరూపంతో ఉంటారు. కాళరాత్రి  అంటే తన భక్తుల మనస్సులో నుంచి  అజ్ఞానం ...  చీకటిని తొలగించేది అని అర్దం ఆమె భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ...  ఎల్లప్పుడూ శుభాన్ని తెస్తుంది. అందుకే, ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.  కాళరాత్రి దేవి ముదురు నీలం లేదా నలుపు రంగుతో నాలుగు చేతులు, విశాలమైన జుట్టుతో గాడిదపై స్వారీ చేస్తుంది. ఎడమ వైపున  ఉన్న రెండు చేతుల్లో కత్తి  ఇనుప ముల్లు ఉంటాయి.కుడివైపున ఉన్న చేతులు వర ముద్ర..  అభయ ముద్రలో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. కాళీ దేవి అంటే  పెద్దగా ఎర్రటి కళ్ళు..   ఎర్రటి నాలుక..  ఉరుములా మెరిసే పూసల హారాన్ని ధరించి ఉంటారు

 మహాగౌరి దేవి: సహనం ..  సమతుల్యతకు ప్రతిరూపం గా దుర్గాదేవి...  మహాగౌరి అమ్మవారిగా అవతరించారు.  ఆమె జ్ఞానం   సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. గులాబీ రంగు మాతృత్వాన్ని ..  శాంతిని అందిస్తుంది. ప్రేమ నిజాయితీని సూచిస్తుంది..దుర్గామాత  అష్టమ శక్తి నామం మహాగౌరి. ఈమె పరిపూర్ణంగా గౌరి వర్ణంలో ఉంటుంది. శంఖ, చంద్ర, కుంద, పుప్పాలతో ఈ గౌర వర్ణం ఉపమించబడింది.  చతుర్బుజాలు గల ఈ తల్లి వాహనం వృషభం. కుడి భుజంలో అభయ ముద్రనూ, కుడి కింది భుజంలో త్రిశూ లాన్నీ ధరించి ఉంటుంది. ఎడమ పై చేతిలో డమరుకాన్నీ, ఎడమ పై చేతిలో వరదముద్రనూ ధరించి ఉంటుంది. అత్యంత శాంతంగా ఉంటుంది.  మహాగౌరి దేవిని ఉపాసించడం  వలన శక్తి అమోఘమైన సత్‌ఫలదాయిని అయి నది. భక్తుల కల్మషాలు.. కష్టాలతో పాటు  వారి పూర్వ సంచిత పాపాలు కూడా పోతాయి.  మహాగౌరి సర్వవిధ శుభాలు ప్రసాదిస్తుంది.

సిద్ధిదాత్రి దేవి:   సిద్ధులను ఇచ్చి, మోక్షానికి మార్గం చూపిస్తుంది.  సిద్ధిదాత్రి అంటే మనకు శక్తి ఇచ్చేది.  ఈ రూపంలో  ఆమెను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు.  సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపవలనే పొందాడని దేవి పురాణంలో పండితులు చెప్పారు.  ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మరొక చేతిలో గద ఉంటాయి.  ఎడమవైపున  ఒక చేతిలో   శంఖమును, మరొక చేతిలో  కమలముఉంటాయి. నిష్ఠ.. భక్తితో సిద్ధిదాత్రి దేవిని  ఆరాధించిన వారికి సకలసిద్ధులుకలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.