
కావాలనే సెక్రటేరియట్ లోని టెంపుల్, మసీదు కూల్చిన్రు: దాసోజు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సెక్రటేరియట్ లోని నల్లపోచమ్మ ఆలయం, మసీదులను కూల్చివేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇందుకు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా టెంపుల్, మసీదును కూల్చివేశారని.. దీనికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వీటిని కూల్చేసిన ప్రాంతంలోనే తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలపై సీఎం కేసీఆర్ , అడ్వకేట్ జనరల్ ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయని.. దీన్ని బట్టి సర్కార్ కావాలనే వాటిని కూల్చేసిందని అర్ధమవుతోందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్ చేసినా కేసు నమోదు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.