నువ్వేమన్న సామంతరాజువా?: దాసోజు శ్రవణ్​

నువ్వేమన్న సామంతరాజువా?: దాసోజు శ్రవణ్​

నోటి మాటలతో సర్కారును నడుపుతవా?: దాసోజు

ప్రజాస్వామ్యంలో కేవలం నోటి మాటలతోనే సర్కారును నడిపించలేమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గమనించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​అన్నారు. ‘‘ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్​డిస్మిస్ అని సీఎం బాధ్యత లేకుండా ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు విధుల్లో చేరాలని అడుగుతున్నారు. అప్పుడు సెల్ఫ్​డిస్మిస్​అయితే ఆ ఆర్డర్​కాపీ ఎక్కడుంది? నవంబర్​5లోగా చేరితే తిరిగి అదే ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ఆదేశాలు ఎక్కడ ఉన్నాయి?  సింహాసనం నుంచి మౌఖిక ఆదేశాలు ఇవ్వడానికి ఆయన​ఏమీ సామంతరాజు కాడు” అని మండిపడ్డారు. కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లను కూడా ప్రైవేటీకరిస్తామంటూ బ్లాక్​మెయిల్ చేస్తున్నారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల చావులకు ప్రభుత్వం బాధ్యత వహించకుండా యూనియన్లను, ప్రతిపక్ష పార్టీలను నిందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సెల్ఫ్​డిస్మిస్​అని కేసీఆర్​ప్రకటించినందుకే కార్మికుల్లో భయం కలిగి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. హైకోర్టు పట్ల కూడా గౌరవం లేకుండా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవుపలికారు. హైకోర్టు తీర్పు వచ్చేదాకా ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని డిమాండ్ చేశారు. రూట్ల ప్రైవేటీకరణ విషయంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.