
- లై డిటెక్టర్ పరీక్షలు చెయ్యాలె
- మంత్రి హత్యకు కుట్ర కేసుపై దాసోజు
హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రలో పోలీసుల వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు బహిరంగంగా లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. హత్య కుట్రలో బీజేపీ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు చెప్పారని, హత్య కుట్రపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారో సీపీ చెప్పలేదన్నారు. ‘‘మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేసేందుకు రూ.12 కోట్లు ఎవరు ఇచ్చారు? సుపారీ ముఠా వద్ద దొరికిన తుపాకులెవరివి? అసలు మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందన్నారు.