
- డసో, టాటాల మధ్య ఒప్పందం
హైదరాబాద్: రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌లేజ్‌ల తయారీ కోసం ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కీలక అగ్రిమెంట్లను ప్రకటించాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ఇది భారతదేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని ఏవియేషన్ సెక్టార్ఎక్స్పర్టులు చెబుతున్నారు.
ఈ భాగస్వామ్యం కింద, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రంలో రఫేల్ విమానం ముఖ్యమైన నిర్మాణ భాగాలు.. వెనుక ఫ్యూజ్‌లేజ్ లాటరల్ షెల్స్, పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్‌లేజ్, ముందు భాగాలను తయారు చేస్తారు. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ఫ్యూజ్‌లేజ్‌లను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి నెలకు రెండు పూర్తి ఫ్యూజ్‌లేజ్‌లను అందించగల సామర్థ్యం ఉంటుంది.
హైదరాబాద్‌లోని ఈ తయారీ కేంద్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. రఫేల్ ఫ్యూజ్‌లేజ్ అంటే రఫేల్ యుద్ధ విమాన ప్రధాన భాగం. ఇది విమానం మొత్తం నిర్మాణాన్ని, ఇంజిన్‌లు, కాక్‌పిట్, ఆయుధాలు, ఇతర వ్యవస్థలను కలుపుతుంది. ఇందులోనే ప్రయాణికులను లేదా వస్తువులను తీసుకువెళ్ళే స్థలమూ ఉంటుంది. ఇది విమానానికి శరీరం వంటిదని ఏవియేషన్ఎక్స్పర్టులు చెబుతున్నారు.
దీని గురించి డసో ఏవియేషన్ చైర్మన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ, "భారతదేశంలో మా సప్లై చెయిన్‌ను బలోపేతం చేయడానికి ఇది కీలకమైన ఒప్పందం. భారతీయ ఏరోస్పేస్ పరిశ్రమలోని ప్రధాన సంస్థలలో ఒకటైన టీఏఎస్ఎల్ సహా మా స్థానిక భాగస్వాములు విస్తరణకు కీలకం. ఈ సరఫరా గొలుసు రఫేల్ ఉత్పత్తి వేగవంతం కావడానికి దోహదపడుతుంది" అని ఆయన పేర్కొన్నారు.