
సంగారెడ్డి: సీఎం కేసీఆర్ మాటలు చెప్తున్నారు తప్ప పనులు చేయడంలేదని అన్నారు బీజేపీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. శుక్రవారం మంజీర రిజర్వయర్ ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాలేశ్వరం కట్టినా ఇప్పటికి ఒక్క ఎకరానికి కూడా కేసీఆర్ నీళ్లివ్వలేదని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 16 మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. గత 5నెలల నుంచి కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు ఇవ్వడంలేదని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకపోయిందని అన్నారు దత్తాత్రేయ. మున్సిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి హైకోర్ట్ మొట్టికాయలు వేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిదులు ఇచ్చినా వాటిని వాడుకోవడం కేసీఆర్ ప్రభుత్వానికి చేతకావడంలేదని అన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని..టీఆర్ఎస్ వైఫల్యాలను గ్రామ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో బీజేపీ బలపడుతుందని రానున్న ప్రభుత్వం తమదేనని అన్నారు.