AUS vs PAK: రిటైర్మెంట్ సిరీస్‌లో వార్నర్ సెంచరీ..పాక్ బౌలర్లను చితక్కొట్టాడుగా

AUS vs PAK: రిటైర్మెంట్ సిరీస్‌లో వార్నర్ సెంచరీ..పాక్ బౌలర్లను చితక్కొట్టాడుగా

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి సిరీస్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. స్వదేశంలో పాకిస్థాన్ తో జరిగే మూడు టెస్టుల సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఇప్పటికీ వార్నర్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేడు (డిసెంబర్ 14) పాక్ తో పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్టులో వార్నర్ సెంచరీతో చెలరేగాడు. పాక్ బౌలర్లను అలవోకగా ఆడేస్తూ కెరీర్ లో తన 26 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ కు జాన్సన్ తో పాటు మరికొందరు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్నర్ పై ఎన్నో విమర్శలు చేశారు. వార్నర్ రిటైర్మెంట్ గ్రాండ్ గా చేయాల్సిన అవసరం లేదని.. అతను బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడని మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ బహిరంగంగానే ఈ ఆసీస్ ఓపెనర్ కు ఘోరంగా అవమానించాడు. మరికొందరైతే వార్నర్ జట్టులో కొనసాగడం అనవసరమని.. అసలు ఫామ్ లో లేడని చెప్పుకొచ్చారు. అయితే ఈ విమర్శలన్నింటికీ వార్నర్ బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.

125 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ ఇన్నింగ్స్ లో  14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.  ఈ సెంచరీతో విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ రికార్డ్ ను సమం చేసాడు. ఓపెనర్ గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు ఆటగాళ్ల లిస్టులో టాప్-5 లో స్థానం సంపాదించాడు. గత నాలుగేళ్ళలో వార్నర్ కు ఇది కేవలం మూడో టెస్టు సెంచరీ మాత్రమే. వార్నర్ సెంచరీతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వార్నర్ (130), హెడ్ (4) క్రీజ్ లో ఉన్నారు. ఖవాజా 41, స్మిత్ 31 పరుగులు చేసి ఔటయ్యారు.   

టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు 

సునీల్ గవాస్కర్ - 33
అలిస్టర్ కుక్ - 31
మాథ్యూ హేడెన్ - 30
గ్రేమ్ స్మిత్ - 27
డేవిడ్ వార్నర్ - 26