
హనుమకొండ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మొత్తం 37 వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, హనుమకొండలో ప్రారంభించినదే మొదటి సెంటర్ కావడం ఆనందంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. శనివారం సుబేదారిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‍ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 60 ఏండ్లపైడిన వృద్ధుల కోసం ఉచితంగా డాక్టర్ల సేవలతోపాటు ఉల్లాసానికి అనువుగా చెస్, క్యారమ్ వంటి ఆటల సౌకర్యాలు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ శాఖ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయ్‍చందర్‍రెడ్డి, ట్రెజరర్ బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ.శ్రీనివాస్, జిల్లా సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, ఎం.శేషుమాధవ్, బిల్లా రమణారెడ్డి, వయోవృద్ధుల సంక్షేమాధికారి జయంతి తదితరులు పాల్గొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో గ్రేటర్ వరంగల్ హనుమకొండకు చెందిన కాసర్ల శ్యామ్‍కు ఉత్తమ గేయ రచయిత అవార్డు పొందిన నేపథ్యంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి శ్యామ్‍ను అభినందించారు. శనివారం ఎమ్మెల్యే శ్యామ్‍ను ఫోన్‍లో పలకరించారు. ఓరుగల్లు గర్వపడేలా గుర్తింపు పొందారని కొనియాడారు.