ఢిల్లీ రేస్‌‌లోనే..20 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌పై గెలుపు

ఢిల్లీ రేస్‌‌లోనే..20 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌పై గెలుపు

న్యూఢిల్లీ: ప్లే ఆఫ్స్‌‌ ఆశలు సజీవంగా ఉండా లంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించింది. అభిషేక్‌‌ పోరెల్‌‌ (36 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 65), జాక్‌‌ ఫ్రేజర్‌‌ మెక్‌‌గుర్క్‌‌ (20 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 50), ట్రిస్టాన్‌‌ స్టబ్స్‌‌ (20 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 41) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ 20 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై నెగ్గింది. టాస్‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 221/8 స్కోరు చేయగా, రాజస్తాన్‌‌ ఓవర్లన్నీ ఆడి 201/8 స్కోరే చేసింది. కెప్టెన్‌‌ సంజూ శాంసన్‌‌ (46 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 86) పోరాటం వృథా అయ్యింది. కుల్దీప్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

ముగ్గురే దంచారు..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీకి మెక్‌‌గుర్క్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిస్తే, అభిషేక్‌‌ పోరెల్‌‌, స్టబ్స్‌‌ భారీ స్కోరును అందించారు. ఫోర్‌‌తో ఖాతా తెరిచిన మెక్‌‌గుర్క్‌‌ స్టార్టింగ్‌‌లోనే రాజస్తాన్‌‌ బౌలింగ్‌‌ను ఉతికి ఆరేశాడు. రెండో ఓవర్‌‌లో అభిషేక్‌‌ రెండు ఫోర్లతో టచ్‌‌లోకి రాగా, థర్డ్‌‌ ఓవర్‌‌ నుంచి మెక్‌‌గుర్క్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించాడు. ఈ ఓవర్‌‌లో  6, 4, 4, తర్వాతి ఓవర్‌‌లో 4, 4, 4, 6, 4, 6తో 28 రన్స్‌‌ దంచాడు. కానీ ఐదో ఓవర్‌‌లో అశ్విన్‌‌ (3/24) ఫుల్‌‌ టాస్‌‌తో మెక్‌‌గుర్క్‌‌కు చెక్‌‌ పెట్టాడు. దీంతో తొలి వికెట్‌‌కు 60 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్‌‌లో షై హోప్‌‌ (1) రనౌట్‌‌ కావడంతో స్కోరు 68/2గా మారింది. 

అభిషేక్‌‌తో జత కలిసిన అక్షర్‌‌ పటేల్‌‌ (15) కూడా ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడాడు. అయితే 10వ ఓవర్‌‌లో అక్షర్‌‌ను ఔట్‌‌ చేసి అశ్విన్‌‌ మళ్లీ బ్రేక్‌‌ ఇచ్చాడు. దీంతో పవర్‌‌ప్లేలో 78/2 స్కోరు చేసిన డీసీ ఫస్ట్‌‌ టెన్‌‌లో 115/3తో నిలిచింది. 28 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన అభిషేక్‌‌ మరో రెండు ఫోర్లు, సిక్స్‌‌తో జోరు కంటిన్యూ చేయగా, 13వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ మరో వికెట్‌‌ తీశాడు. ఓ స్లో బాల్‌‌తో అభిషేక్‌‌ను ఔట్‌‌ చేసి థర్డ్‌‌ వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. 

ఏడు బాల్స్‌‌ తర్వాత రిషబ్‌‌ పంత్‌‌ (15) కూడా వెనుదిరగడంతో నాలుగో వికెట్‌‌కు 34 రన్స్‌‌ రావడంతో  స్కోరు 150/5గా మారింది. ఈ దశలో స్టబ్స్‌‌ సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. గుల్బాదిన్‌‌ నబీ (19) వచ్చీ రావడంతోనే 6, 4తో అండగా నిలిచాడు. అప్పటి వరకు సింగిల్స్‌‌ తీసిన స్టబ్స్‌‌18వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌, ఆ వెంటనే మరో బౌండ్రీ దంచాడు. కానీ 19వ ఓవర్‌‌లో నబీ ఔట్‌‌కావడంతో ఆరో వికెట్‌‌కు 45 రన్స్‌‌ జతయ్యాయి. చివర్లో సలామ్‌‌ (9) రెండు ఫోర్లు, స్టబ్స్‌‌ ఓ ఫోర్‌‌, సిక్స్‌‌ కొట్టి ఔటైనా డీసీ స్కోరు 200 దాటింది. 

శాంసన్‌‌ ఒక్కడే..

భారీ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌ తరఫున శాంసన్‌‌ ఒక్కడే పోరాటం చేశాడు. ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కే యశస్వి (4), ఐదో ఓవర్‌‌లో బట్లర్‌‌ (19) ఔటయ్యారు. రెండో వికెట్‌‌కు 63 రన్స్‌‌ జత చేసిన శాంసన్‌‌కు తోడైన రియాన్‌‌ పరాగ్‌‌ (27) కూడా వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 28 బాల్స్‌‌లో శాంసన్‌‌ హాఫ్‌‌ సెంచరీ చేయగా, పవర్‌‌ప్లేలో 67/2తో ఉన్న స్కోరు పది ఓవర్లకు 93/2కి చేరింది. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 11వ ఓవర్‌‌లో సలామ్‌‌ (1/36) విడదీశాడు. బ్యాక్‌‌హ్యాండ్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌తో పరాగ్‌‌ను ఔట్‌‌ చేయడంతో మూడో వికెట్‌‌కు 36 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఓ ఎండ్‌‌లో వికెట్లు పడినా శాంసన్‌‌ మాత్రం 6, 6, 4, 6, 4తో రెచ్చిపోయాడు. కొత్తగా వచ్చిన శుభమ్‌‌ దూబె (25) 4, 6తో టచ్‌‌లోకి వచ్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న శాంసన్‌‌ను 16వ ఓవర్‌‌లో ముకేశ్‌‌ ఔట్‌‌ చేయడంతో ఫోర్త్‌‌ వికెట్‌‌కు 59 రన్స్‌‌ ముగిశాయి. ఇక 24 బాల్స్‌‌లో 52 రన్స్‌‌ కావాల్సిన దశలో దూబె 6, 4 కొట్టి ఔటయ్యాడు. ఆ తర్వాత పావెల్‌‌ (13), ఫెరారియా (1), అశ్విన్‌‌ (2) వికెట్లు పడటంతో రాజస్తాన్‌‌ ఓడింది.

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 221/8 (అభిషేక్‌‌ 65, మెక్‌‌గుర్క్‌‌ 50, అశ్విన్‌‌ 3/24).

రాజస్తాన్‌‌: 20 ఓవర్లలో 201/8 (శాంసన్‌‌ 86, కుల్దీప్‌‌ 2/25)