అసంపూర్తి పనులను ప్రారంభించడం హాస్యాస్పదం : శ్రీహరి రావు

అసంపూర్తి పనులను ప్రారంభించడం హాస్యాస్పదం : శ్రీహరి రావు

నిర్మల్,  వెలుగు:  నిర్మల్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామం వద్ద 2008లో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని గుర్తుచేశారు.

కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు మార్చి.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పేరుతో రూ.714 కోట్లతో ప్రారంభోత్సవాలు చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎత్తిపోతల పథకానికి శాశ్వత విద్యుత్తు సౌకర్యం లేదని.. కేవలం వారంరోజుల కోసం తాత్కాలిక అనుమతి తీసుకుని కరెంట్ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తోందని రైతులను, ప్రజలను మోసం చేసేందుకు హడావుడిగా వాటిని ప్రారంభించారని అన్నారు.

ఎత్తిపోతలపై మంత్రులు చెప్పినవన్నీ అబద్దాలేనని, ఈ విషయంపై చర్చించేందుకు ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఆయిల్ పామ్, నిర్మల్ మాస్టర్ ప్లాన్, మున్సిపల్ ఉద్యోగాలపై స్పష్టతనివ్వకుండా దాటవేసే ధోరణి అవలంబించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపే ప్రతిపక్ష నాయకులపై పోలీసులు వ్య వహరించిన తీరు అమానుషమని మండిపడ్డారు. పోలీసులు తమ తీరును మార్చుకోవాలన్నారు.