నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి : కూచాడి శ్రీహరిరావు

నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి :  కూచాడి శ్రీహరిరావు

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలో పామాయిల్​ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా ఉండడంతో జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. సోన్ మండలం పాక్ పట్లలో ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థల సేకరణ జరిగిందని, కానీ ఇంతలోనే నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

పాక్ పట్ల ప్రాంతంలో పరిశ్రమ నిర్మాణానికి అనుకూలమైన స్థలం లేకపోతే మామడ, నర్సాపూర్ (జి) మండలాల్లో స్థల సేకరణ చేపట్టాలన్నారు. జిల్లాలో పామాయిల్​ పరిశ్రమ నిర్మించాలని కోరారు. స్పందించిన మంత్రి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి చెప్పినట్లు శ్రీహరి రావు తెలిపారు. ఆయన వెంట  నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్​లు సోమా భీంరెడ్డి, ఆనంద్ రావు పాటిల్ తదితరులున్నారు.