- డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
సత్తుపల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిత్వానికి రెబల్ గా నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా రాగమయి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలు అంతా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.
భవిష్యత్లో పార్టీ పరంగా మరెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం రెబల్ అభ్యర్థులుగా పార్టీ తరఫున నామినేషన్ వేసిన వారంతా ఉప్సంహరించుకోవాలని కోరారు. సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రెబెల్ అభ్యర్థులు ఉపసంహరించుకోకపోతే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు శివ వేణు, తోట సుజల రాణి, కొత్తూరు ప్రభాకర్ రావు, పింగళి సామేలు, గఫార్, నాగుల్ మీర తదితరులు పాల్గొన్నారు.

