
ఆదిలాబాద్, వెలుగు: డీసీసీబీలో రూ. 2.85 కోట్లు కొట్టేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు(ఏడీసీసీబీ) స్టాఫ్ అసిస్టెంట్‌గా శ్రీపత్కుమార్ పని చేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన శ్రీపత్కుమార్ డోప్టాల పీఏసీఎస్, బేల పీఏసీఎస్ పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. ఎలాంటి వోచర్, బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ల పర్మిషన్ లేకుండానే వారి పాస్వర్డ్ వాడుకొని భార్య, బావ, మరదలు, అత్త అకౌంట్లలోకి రూ. 2.85 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ నగదును మళ్లీ ఫ్రెండ్స్ అకౌంట్లలోకి బదిలీ చేశాడు. లెక్కల్లో రూ. 2.85 కోట్లు తేడా రావడంతో బేల అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీపత్ కుమార్ ను అరెస్టు చేశారు. రూ. 98 లక్షలు రికవరీ చేశారు. రూ. 1.40 కోట్లు ఆన్లైన్బెట్టింగ్లో పోగొట్టినట్లు తేల్చారు.