మోంథా తుఫాను ప్రభావంతో అటు ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో అధికారులు, పోలీసులు పలు ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు. అయితే ఖమ్మం జిల్లాలో ఒక డ్రైవర్ పోలీసుల మాటలను లెక్కచేయకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేసి డీసీఎంతో సహా వాగులో కొట్టుకుపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో వరలో కొట్టుకుపోయింది డీసీఎం. నిమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు ఎవరూ దాటొద్దనే హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. తనది డీసీఎం కదా.. పెద్ద బండిని వరద ఏం చేస్తుందిలే అనే నిర్లక్ష్యంతో వాగు దాటే ప్రయత్నం చేశాడు. కానీ బలంగా పారుతున్న వాగు డీసీఎంను మెల్లమెల్లగా తోసేసింది.
►ALSO READ | ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాను బీభత్సం.. మధిరలో ఇండ్లలోకి చేరిన వరద నీరు..హైవేపై ధర్నాకు దిగిన స్థానికులు
డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. వరద ప్రవాహాని తట్టుకోలేక వాగులో పడిపోయింది. డ్రైవర్ తో సహా వ్యాన్ నదిలో పడవ మాదిరిగా వెళ్తున్న దృష్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. డ్రైవర్ వ్యానులోనే ఉండిపోయాడు. సహాయక చర్యల కోసం పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.
