కేసు పంచనామా చేస్తుండగా.. ఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం

కేసు పంచనామా చేస్తుండగా.. ఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం
  • విరిగిన ఎస్ఐ కాలు 

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​ బాలానగర్  ఫ్లైఓవర్ ​బ్రిడ్జిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు చనిపోగా.. ఆ కేసు పంచనామా నిర్వహిస్తున్న ఎస్ఐని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ ఎడమ కాలు విరిగిపోయింది. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి బాలానగర్​నుంచి కూకట్​పల్లి వైపు ఫ్లైఓవర్​పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. 

ఆ టైంలో బోయిన్​పల్లి నుంచి కూకట్​పల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రొబెషనరీ ఎస్ఐ వెంకటేశం ఘటనా స్థలానికి చేరుకున్నాడు. 3.10 గంటల టైంలో పంచనామా చేసి డెడ్​బాడీని 108 వాహనంలో ఎక్కిస్తున్నారు. అదే టైంలో కూకట్​పల్లి వైపు వస్తున్న డీసీఎం వేగంగా ఎస్ఐని ఢీకొట్టింది. 

దీంతో ఎస్ఐ ఎడమ కాలు విరిగిపోయింది. దీంతో అతడిని వెంటనే ఓ ప్రైవేట్​దవాఖానకు తరలించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి సంబంధించిన కారు డ్రైవర్, ఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్​ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని బాలానగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.