దిశ నిందితుల డెడ్​బాడీలు అర్ధరాత్రి మెడికల్ కాలేజీకి

దిశ నిందితుల డెడ్​బాడీలు అర్ధరాత్రి మెడికల్ కాలేజీకి
  • భద్రపర్చిన తీరుపై ఎన్​హెచ్చార్సీ అభ్యంతరంతో నిర్ణయం
  • ఆస్పత్రిలో ఫ్రీజర్లు లేకపోవడంతోనే తరలింపు?
  • చివరి చూపు కోసం నిందితుల కుటుంబ సభ్యుల ఎదురుచూపు
  • నేడు హైకోర్టులో విచారణ.. డెడ్​బాడీలు అప్పగించే అవకాశం

‘దిశ’ అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రి నుంచి మెడికాల్ కాలేజీకి శనివారం అర్ధరాత్రి తరలించారు. మృతదేహాలను భద్రపర్చిన తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్​ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డెడ్ బాడీలు డీ కంపోజ్ అవుతుండటం, సోమవారం వరకు మృతదేహాలను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించడంతో విచారణ లేటయితే సమస్యలొస్తాయని మెడికల్ కాలేజీకి తరలించారు. అదీగాక మహబూబ్​నగర్​ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపర్చే ఫ్రీజర్లు లేవు. నలుగురు నిందితుల డెడ్ బాడీలను ఉంచేందుకు తాత్కాలికంగా జిల్లా పోలీసులే ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. అవి కూడా మృతదేహాలను భద్రపర్చేంతగా అనువైనవి కావు. డీకంపోజ్ కాకుండా కెమికలైజేషన్​తో మేనేజ్​చేయవచ్చని అనుకున్నారు. కానీ నాలుగైదు రోజులు పట్టడంతో కాలేజీకి తరలించి అనాటమీ వార్డులో భద్రపరిచారు. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

నేడు బంధువులకు అప్పగింత

ఎన్​కౌంటర్​పై హైకోర్టులో అర్జెంట్ మోషన్ దాఖలు కావడంతో 9వతేదీ వరకు మృతదేహాలను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అందజేయలేదు. సోమవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉండటంతో సాయంత్రం లేదా.. రాత్రి లోపు మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ విచారణలో రీ పోస్టుమార్టం చేయాలని భావిస్తే మరో రోజు పోడిగించే అవకాశం ఉందని అంటున్నారు.

కళ్లు కాయలు కాచేలా..

ఎన్​కౌంటర్ జరిగి మూడు రోజులు దాటినా మృతదేహాలు అప్పగించకపోవడంతో నిందితుల కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బిడ్డలు చనిపోయారని బాధపడాలో, చనిపోయినా ఖననం చేసుకునేందుకు ఇన్ని అడ్డంకులు వస్తుందన్నందుకు ఏడ్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. నలుగురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అంత్యక్రియలకు పోలీసుల ఏర్పాట్లు

నిందితుల గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో నిందితుల శవాలను పూడ్చటానికి నిరాకరించడం.. గుంతలు తవ్వడానికి కూడా ముందుకు రాకపోవడంతో పోలీసులే దగ్గరుండి జేసీబీని తెప్పించి తవ్వించారు. పోలీసులే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు మహబూబ్​నగర్ వెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేసి, డెడ్ బాడీలను గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో పోలీసులు ఎప్పటికప్పుడు ఈ రెండు గ్రామాల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

తవ్విన గుంతలు పూడ్చిన్రు

దిశ నిందితుల డెడ్ బాడీలను పూడ్చేందుకు మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాల్లో జేసీబీతో పోలీసులు గుంతలు తీయించారు. గోతులు తీసి రెండు రోజులవుతోంది. సాంప్రదాయం ప్రకారం గోతులను తీసిన రోజే మృతదేహాలను ఖననం చేయాలని, వాటిని ఇప్పటికీ పూడ్చలేదని, తవ్విన గుంతలు అలాగే ఉండటంతో తమ గ్రామానికి అరిష్టం ఏర్పడుతుందని గ్రామస్థులు ఆదివారం పూడ్చేశారు. దీంతో సోమవారం మృతదేహాలు తీసుకొస్తే వెంటనే గుంతలను తవ్విస్తామని పోలీసులు చెప్పారు.