- వారం కింద గుండెపోటుతో మృతి
- పేరు తొలగించకుండానే ఎన్నికలు
- 378 ఓట్ల మెజార్టీతో గెలుపు
- అధికారుల తీరుతో త్వరలో ఎన్నిక
- రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఘటన
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో వారం కింద చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి విజేతగా నిలిచాడు. పోయిన గురువారం సదరు అభ్యర్థి గుండెపోటుతో చనిపోయినప్పటికీ ఆయన పేరు తొలగించకుండానే అధికారులు ఎలక్షన్స్ నిర్వహించారు. దీంతో సదరు వ్యక్తి 378 పైచిలుకు భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందగా.. మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన చెర్ల మురళి(50).. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఈ నెల 4న అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.
అప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రించడంతో అధికారులు గురువారం ఎలక్షన్స్ నిర్వహించారు. చనిపోయిన అభ్యర్థికి జనం ఓటు వేయరని అధికారులు భావించగా, అందుకు విరుద్ధంగా జరిగింది. ఎన్నికల్లో సానుభూతి పనిచేయడంతో చనిపోయిన మురళి తన సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఎన్నికల అధికారులు.. అభ్యర్థి చనిపోయినందున ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.
భర్త ఆత్మహత్య.. వార్డు మెంబర్‌గా గెలిచిన భార్య
ముత్తారం, వెలుగు: పోలింగ్ ముందు రోజు ఓ వార్డు అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం వెల్లడించిన ఫలితాల్లో మృతుడి భార్య విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పోలుదాసు శ్రీనివాస్ (35) అనే యువకుడు తన భార్య లతతో నాలుగో వార్డు స్థానం నుంచి పోటీ చేయించాడు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించే శ్రీనివాస్.. కుటుంబ కలహాలతో బుధవారం పురుగు మందు తాగాడు.
గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. దీంతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ పరిణామంతో ఓటర్లు కూడా శ్రీనివాస్ భార్య లతను గెలిపించడం విశేషం.

