అంత్యక్రియలు జరిగిన వ్యక్తి తిరిగొచ్చాడు

అంత్యక్రియలు జరిగిన వ్యక్తి తిరిగొచ్చాడు

కేరళ: అంత్యక్రియలు జరిగిన వ్యక్తి నిక్షేపంగా తిరిగొచ్చాడు. అవును మీరు చదివింది నిజమే. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా పరిధిలోని కుదస్సనాడు గ్రామంలో జరిగిందీ సంఘటన. అది కూడా అంత్యక్రియలు జరిగిన 3 నెలల తర్వాత ఆ వ్యక్తి ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. మరి అంత్యక్రియలు జరిగిన వ్యక్తెవరన్నది ఇటు వ్యక్తి బంధువులకు, అటు పోలీసులకు అర్థం కావడం లేదు. కుటుంబ సభ్యులు, బంధువులైతే బతికొచ్చాడు చాలనుకుని సంబరపడుతుంటే.. పోలీసులు మాత్రం జరిగిన పొరపాటును ఎలా సరిదిద్దాలో.. అంత్యక్రియలు జరిగిన వ్యక్తెవరన్నది ఎలా తేల్చాలంటూ తలలు పట్టుకున్నారు. 
ఎలా జరిగిందింది.. ఎలా బయటపడింది..
తిరువనంతపురంలో బస్ క్లీనింగ్, క్యాటరింగ్ వంటి చిన్న చితకా పనులు చేసుకుని జీవించే సాబూ.. వీలు దొరికితే చిన్నచిన్న చోరీలు చేసేవాడు. గత ఏడాది నవంబర్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అతను కనిపించకుండా పోయాడు. ఇంతలో గత డిసెంబర్ 24వ తేదీన కొట్టాయం జిల్లా పాలా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సాబూ పోలికలు కనిపించడంతో అతని కుటుంబ సభ్యులకు పిలిపించి మృతదేహాన్ని చూపించారు. తమ వాడేనని శవాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కర్మకాండలు పూర్తి చేశారు. ఇంతలో మొన్న శుక్రవారం తిరువనంతపురం బస్ డ్రైవర్ కు సాబూ కనిపించాడు. ఒకప్పుడు తన దగ్గర పనిచేసిన వ్యక్తి కావడంతో గుర్తించి మాట్లాడాడు. అదేంటి నువ్వు చనిపోయావని మీ వాళ్లు అంత్యక్రియలు కూడా చేసేశారు కదా అంటే.. అయ్యో అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయాన్ని బస్ డ్రైవర్ వెంటనే పోలీసులకు తెలియజేయడంతో.. పోలీసులు ఆశ్చర్యపోయారు. జరిగిన పొరపాటును ఎలా సరిచేయాలోనంటూ తలపట్టుకున్నారు.  గత డిసెంబర్ 24న అంత్యక్రియలు జరిగిన వ్యక్తి ఎవరన్నది అర్థం కాక మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు.