గ్యాస్ కొరత వెనుక డీలర్ల హస్తం.?

గ్యాస్ కొరత వెనుక డీలర్ల హస్తం.?

హైదరాబాద్, వెలుగు:నగర పరిధిలో కొందరు గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. దీని వెనుక డీలర్ల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా గ్యాస్​ కొరత సృష్టిస్తూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా  ఇండియన్‌‌ ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌(ఐఓసీ), భారత్‌‌ పెట్రోలియం(బీపీ), హిందుస్థాన్‌‌ పెట్రోలియం కార్పొరేషన్‌‌(హెచ్‌‌పీసీ)సంస్థల ద్వారా కొన్ని ప్రైవేటు సంస్థలు నగరంలోని వినియోగదారులకు వంట గ్యాస్‌‌ సరఫరా చేస్తున్నాయి. సుమారుగా 28 లక్షల గ్యాస్‌‌ కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారులకు సరఫరా చేసేందుకు 2,560 మంది డీలర్లు ఉన్నట్లు సమాచారం.

ఇదీ అసలు కథ

సిలిండర్‌‌ బుక్‌‌ చేసిన వినియోగదారులకు డెలివరీకి సంబంధించిన సమాచారం సెల్​ఫోన్​కు వస్తుంది. సమాచారం వచ్చిన వారం రోజులు గడిచిపోయినా గ్యాస్​ డెలివరీ కావడం లేదని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. చివరకు గ్యాస్​ఏజెన్సీ వద్దకు వెళ్లి సంప్రదిస్తే డోర్​లాక్​ ఉండడం వల్ల గ్యాస్​ డెలివరీ కాలేదనే సమాధానం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. ఈక్రమంలో వినియోగదారులకు, డీలర్ల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ క్షణంలో అప్పటికప్పుడు వినియోగదారులకు సర్దిచెప్పి పంపిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం దొరకడం లేదు. నిత్యం జరుగుతున్న తంతు ఇదేనని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డెలవరీ బాయ్స్​తీరువల్ల గ్యాస్​ అక్రమంగా ఇతరులకు అందజేస్తున్నారని పేర్కొంటున్నారు. బుక్‌‌ అయిన సిలిండర్లు ఇంటికి చేరకుండా హోటళ్లు, టిఫిన్‌‌, ఫాస్ట్‌‌ఫుడ్‌‌ సెంటర్లు, మెస్‌‌లకు చేరవేస్తున్నారని చాలామంది వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కమర్షియల్​సిలిండ్లరను ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ కొందరు డీలర్లు, బాయ్స్ నిర్వాకం వల్ల ఆయా వ్యాపారులు డొమెస్టిక్‌‌ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఇందుకు వారి నుంచి అదనంగా  రూ.50 నుంచి 100 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రోజులో సరఫరా అవుతున్న గ్యాస్ సిలిండ్లరలో పది శాతం వరకు హోటళ్లు, టిఫిన్‌‌, ఫాస్ట్‌‌ఫుడ్‌‌ సెంటర్లు, మెస్‌‌లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూ.వేలల్లో బాయ్స్​జేబులు నిండుతున్నాయి.

ప్రత్యేక నిఘా

ఇప్పటికే గ్యాస్​ కొరత, అక్రమ తరలింపుపై వినియోగదాల నుంచి చాలా వరకు పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో సదరు శాఖ ప్రత్యేకంగా ఉన్న విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ విభాగాన్ని అప్రమత్తం చేసింది. సిలిండర్లను కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్​ తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. అలాగే, డోర్​ డెలివరీకి సంబంధించి వినియోగదారులు సైతం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఎలాంటి సమాచారం, ఫిర్యాదు కోసమైనా పౌరసరఫరాల శాఖను సంప్రదింవచ్చని సదరు శాఖ అధికారి ఒకరు తెలిపారు.