
- సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తెస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, దాని అనుబంధ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఉస్మానియా డాక్టర్లు విశేషమైన వైద్య సేవలతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు హెల్త్ హబ్ గా గొప్ప బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చారని ఆయన ప్రశంసించారు.
ఎస్సార్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉస్మానియా, దాని అనుబంధ ఆస్పత్రుల వైద్య సేవలపై బుధవారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అభివృద్ధి, సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి..
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, రిపేర్ కు గురైన మెషినరీలు, ఆర్వో వాటర్ ప్లాంట్, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్ల నిర్మాణం, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రిలో ఓపీ, ఐపీ సేవల వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
సరోజినీ దేవి కంటి ఆసుపత్రి అభివృద్ధిపైనా మంత్రి చర్చించారు. ఉస్మానియా బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్టుగా అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, ఉస్మానియా అనుబంధ మెడికల్ కాలేజీల హెచ్‌ఓడీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యత
ఆరోగ్యవంతమైన మహిళలే ఆరోగ్యకరమైన సమాజానికి నిర్మాతలని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి రాజనర్సింహ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించిన "స్వస్థ్ నారీ సశక్త్ పరివార్" అభియాన్ కార్యక్రమంలో మంత్రి హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అమీర్‌పేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి మంత్రి దామోదర్ రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ అభియాన్‌లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే హెల్త్ క్యాంపులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.