
ఎల్బీనగర్, వెలుగు: తక్కువ ధరకు ప్లాట్లు, విల్లాలు అంటూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేశారు. ఇలాంటి బాధితులు సుమారు 200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ 50 మంది బాధితులు బుధవారం ఎల్బీనగర్ డీసీపీని కలిసి శాంతియుతంగా నిరసన తెలిపారు. దీంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. ఎల్బీనగర్లోని క్రితిక ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ అగ్గువ ధరకే ప్లాట్లు, విల్లాలు విక్రయిస్తామని ప్రకటించింది. 2022 నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేశారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే ప్రీ లాంచ్ పేరిట ఈ కార్యక్రమం చేపట్టారు. రెండేండ్లు గడిచినా డబ్బులు కట్టిన వారికి పొజిషన్ ఇవ్వడం లేదు. ఉన్నట్టుండి ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది.
ఇప్పటికే ఆ సంస్థ ఎండీ దుమావత్ శ్రీకాంత్‌పై వేర్వేరు పోలీస్స్టేషన్లలో 16 కేసులున్నాయి. తప్పించుకు తిరుగుతున్న ఆయనను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు గత శుక్రవారం రిమాండ్ కు తరలించారు. మోసగించిన వారిలో మరికొందరు ఉన్నారని, వారిపై కూడా చర్యలు తీసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు.