ఏ పనికి.. ఎంత రేటు? సిబ్బందికి పాఠాలు చెప్పిన ఏడీ అంబేద్కర్.. బినామీల ఇంట్లో బయటపడ్డ కోట్ల నగదు, డాక్యుమెంట్లు

ఏ పనికి.. ఎంత రేటు? సిబ్బందికి పాఠాలు చెప్పిన ఏడీ అంబేద్కర్.. బినామీల ఇంట్లో బయటపడ్డ కోట్ల నగదు, డాక్యుమెంట్లు
  • అవినీతిపై కింది స్థాయి సిబ్బందికి ఏడీఈ అంబేద్కర్​ పాఠాలు
  •  చేవెళ్ల ఏడీఈ రాజేశ్​ ఇంట్లో రూ.17 లక్షలు, 20 డాక్యుమెంట్లు సీజ్
  •  బినామీ సతీశ్ ఇంట్లో పట్టుబడ్డ రూ.2.18 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎలక్ట్రిసిటీ ఏడీఈ  ఇరుగు అంబేద్కర్‌‌ కు సంబంధించిన ఆదాయానికి మించి ఆస్తుల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కింది స్థాయి ఉద్యోగులకు అంబేద్కర్‌‌‌‌ తరచూ అవినీతి పాఠాలు నేర్పించేవారని తేలింది. బుధవారం ఆయన బినామీల్లో ఒకరైన చేవెళ్ల ఏడీఈ రాజేశ్ ఇళ్లలో  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

సికింద్రాబాద్‌‌ మారేడ్‌‌పల్లిలోని రాజేశ్ ఇంటితో పాటు చేవెళ్లలోని ఆఫీసులో సోదాలు చేశారు. ఇంట్లోని బాత్‌‌రూమ్‌‌లో రూ.17 లక్షలు నగదు, వివిధ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి 20కి పైగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్ గతంలో అంబేద్కర్‌‌‌‌తో కలిసి పనిచేసినట్లు గుర్తించారు. డిపార్ట్‌‌మెంట్‌‌లో ఎలాంటి పనులకు ఎంత మొత్తంలో వసూలు చేయాలి.. ఏసీబీకి చిక్కకుండా ఎలాంటి ఎత్తులు వేయాలనేది అంబేద్కర్‌‌ను చూసి నేర్చుకున్నట్లు తెలిసింది.

 ఏడీఈ అంబేద్కర్‌‌‌‌ ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంబేద్కర్‌‌‌‌ను అరెస్ట్‌‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌‌గూడ జైలుకు తరలించారు. గురువారం కస్టడీ పిటిషన్​తో పాటు అంబేద్కర్​కు చెందిన బ్యాంకు లాకర్లు ఓపెన్​చేసేందుకు కోర్టు అనుమతిని కోరనున్నట్లు తెలిసింది. కాగా, లాకర్లు ఓపెన్​ చేస్తే మరిన్ని అక్రమాస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశముందని ఏసీబీ ఆఫీసర్లు భావిస్తున్నారు.

అవినీతి సొమ్ము లెక్కలు తీస్తున్నారు

సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని అంబేద్కర్‌‌‌‌ బంధువు సతీశ్ ఇంట్లో రూ.2.18 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డబ్బు అంబేద్కర్‌‌‌‌కు చెందినదేనని కన్ఫామ్ చేశారు. దీంతో పాటు అంబేద్కర్ కారులో స్వాధీనం చేసుకున్న రూ.5.5 లక్షలు, బ్యాంకులో ఉన్న రూ.77.5 లక్షలకు సంబంధించిన లెక్కలు తీస్తున్నారు. 

ఈ క్రమంలోనే సతీశ్ ఇంట్లో నిల్వ చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. సతీశ్ తో పాటు కొంత మంది ఉద్యోగుల బంధువులు, స్నేహితులు కూడా అంబేద్కర్‌‌‌‌కు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు.ఈ మేరకు అంబేద్కర్ సహా ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా..బినామీలుగా అనుమానిస్తున్న వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని అంథార్‌‌‌‌ కెమికల్స్‌‌ కంపెనీలో భాగస్వాములను గుర్తించినట్లు తెలిసింది. 

బినామీల చిట్టాలో ఏడీఈ రాజేశ్

అంబేద్కర్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా అధికారులు బినామీలను గుర్తించారు. ఇందులో రాజేశ్ గతంలో అంబేద్కర్‌‌‌‌తో కలిసి పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు.  9 నెలల క్రితమే చేవెళ్ల ఏడీఈగా బాధ్యతలు చేపట్టాడు. రాజేశ్ తన పరిధిలోకి వచ్చే చేవెళ్ల, షాబాద్, శంకర్‌‌‌‌పల్లి, మొయినాబాద్ తదితర మండలాల్లోని రైతులు, పరిశ్రమలు ఇతర విద్యుత్ కనెక్షన్ల కోసం భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అంబేద్కర్‌‌‌‌ కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో రాజేశ్‌‌కు చెందిన కొన్ని ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఉద్యోగులు, స్నేహితులతో కలిసి అంబేద్కర్‌‌‌‌ తన బినామీ నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. టీజీఎస్‌‌పీడీసీఎల్‌‌లో కాంట్రాక్టు పనులను‌‌ తన బినామీలకు ఇప్పించినట్లు, వారి పేరునే ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తన విభాగంలో పనిచేసిన అధికారులు, కింది స్థాయి ఉద్యోగుల సహకారంతో లంచం డబ్బులు వసూలు చేసేవాడని నిర్ధారించారు.