
- 16 నెలల చిన్నారికి.. రోబోటిక్ టెలీ సర్జరీ
- హైదరాబాద్‌లో ఉన్న పేషెంట్‌కు హర్యానా నుంచి ఆపరేషన్
- ఈ వయసు బాలుడికి టెలి సర్జరీ చేయడం ప్రపంచంలోనే మొదటిసారి
- గంటలోనే ఆపరేషన్ పూర్తి చేసిన డాక్టర్లు.. మరుసటి రోజే చిన్నారి డిశ్చార్జ్
హైదరాబాద్, వెలుగు: మెడికల్ టెక్నాలజీ రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌కు 1,600 కిలోమీటర్ల దూరంలో హర్యానాలో ఉన్న కన్సోల్ నుంచి, హైదరాబాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 16 నెలల చిన్నారికి రోబోటిక్ టెలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ ఈ అరుదైన సర్జరీని నిర్వహించారు.
పుట్టుకతోనే కిడ్నీ సంబంధ సమస్య (యూరేటరోపెల్విక్ జంక్షన్ అబ్‌స్ట్రక్షన్)తో బాధపడుతున్న 16 నెలల బాలుడికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. బాలుడు కొండాపూర్‌లోని ప్రీతి ఆసుపత్రిలో ఉండగా, డాక్టర్ చంద్రమోహన్ హర్యానా గుర్‌గ్రామ్‌లోని ఎస్ఎస్ఐ మంత్ర ఆఫీసులోని సర్జికల్ కన్సోల్ ద్వారా ఈ ఆపరేషన్ చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘ఎస్ఎస్ఐ మంత్ర’ రోబోటిక్ సిస్టమ్, 5జీ టెక్నాలజీ సహాయంతో ఈ సంక్లిష్టమైన సర్జరీని గంట వ్యవధిలోనే పూర్తి చేశారు.
సర్జరీ సక్సెస్ కావడంతో బాలుడు త్వరగా కోలుకొని, మరుసటి రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రపంచంలోనే ఇంత చిన్న వయసు బాలుడికి టెలి సర్జరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉన్న ఒక మహిళకు కూడా డాక్టర్ చంద్రమోహన్ హైదరాబాద్ నుంచే టెలి- రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య జరిగిన తొలి టెలి సర్జరీగా ఇది రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ.. ‘సర్జరీలకు దూరం అనేది ఇకపై అడ్డంకి కాదు. ఈ టెక్నాలజీ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని రోగులకు కూడా నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని అన్నారు. ఈ విజయాల వెనుక తమ వైద్య బృందం, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్స్ టీమ్ కృషి ఉందన్నారు.