అధిక వడ్డీ ఆశ చూపి రూ. 7 కోట్లు మోసం.. నాగర్ కర్నూల్ పోలీసుల అదుపులో నిందితులు

అధిక వడ్డీ ఆశ చూపి రూ. 7 కోట్లు మోసం.. నాగర్ కర్నూల్ పోలీసుల అదుపులో నిందితులు

కందనూలు, వెలుగు : అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి రూ. 7 కోట్లు వసూలు చేసి పరారైన నలుగురిని నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్‌‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా గుడిపల్లి గ్రామానికి చెందిన గుండ్రాల మాసయ్య గతంలో సీఆర్పీఎఫ్‌‌లో పనిచేసి రిటైర్‌‌ అయ్యాడు. తర్వాత హైదరాబాద్‌‌ రామంతాపూర్‌‌లోని ఓ బ్యాంక్‌‌లో సెక్యూరిటీ గార్డ్‌‌గా చేరాడు. 

అతడికి 2021లో మాదాపూర్‌‌లోని ఓ కంపెనీలో పనిచేసే, అండమాన్‌‌కు చెందిన రోహన్‌‌, ఆదిల్‌‌ పరిచయం అయ్యారు. తాము గ్రోల్యాండ్‌‌ అనే కంపెనీని స్థాపించామని, మా కంపెనీలో డిపాజిట్‌‌ చేస్తే అధిక వడ్డీ ఇస్తామని, మరికొందరితో డిపాజిట్‌‌ చేయిస్తే నెలకు రూ. 30 వేల జీతంతో పాటు కమీషన్‌‌ సైతం ఇస్తామని నమ్మించారు. 

దీంతో మాసయ్య బ్యాంక్‌‌ జాబ్‌‌ మానేసి తన వద్ద ఉన్న రూ. 1.68 కోట్లను గ్రోల్యాండ్‌‌ కంపెనీలో డిపాజిట్‌‌ చేయడంతో పాటు మరో 50 మంది ద్వారా సుమారు రూ. 6.78 కోట్లు డిపాజిట్‌‌ చేయించాడు. కొన్ని రోజుల పాటు అందరికీ సక్రమంగా వడ్డీలు చెల్లిస్తూ వచ్చారు. 

అ తర్వాత వడ్డీ ఇవ్వడం మానేయడంతో పాటు కంపెనీని మూసేశారు. దీంతో మాసయ్య ఈ ఏడాది మేలో నాగర్‌‌కర్నూల్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్‌‌ టీమ్‌‌తో అండమాన్‌‌కు వెళ్లి రోహన్, ఆదిల్‌‌తో పాటు రాము, అలీని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం రాత్రి నాగర్‌‌కర్నూల్‌‌ జైలుకు తరలించామని సీఐ అశోక్‌‌రెడ్డి తెలిపారు.