మరణించిన టీచర్ల కుటుంబాలకు.. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి: విద్యాశాఖ సెక్రటరీకి వినతి

మరణించిన టీచర్ల కుటుంబాలకు.. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి: విద్యాశాఖ సెక్రటరీకి వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 194  మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ సీపీఎస్ టీచర్లకు తక్షణమే డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్​టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు. బుధవారం సెక్రటేరియెట్​లో విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాను  అసోసియేషన్ నేతలు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా భూతం యాకమల్లు మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో 2013, 2014లో మోడల్ స్కూల్ టీచర్లు రెగ్యులర్ పద్ధతిలో నియమితులయ్యారని తెలిపారు.

ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం సీపీఎస్ కోత పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పదిశాతం మాచింగ్ గ్రాంట్స్ ఇస్తోందని పేర్కొన్నారు. అయినా, సీపీఎస్ ఉద్యోగులు మరణిస్తే, వారికి డెత్ గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్​ ప్రయోజనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీచర్లు చనిపోయారని, వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి  మరణించిన టీచర్ల కుటుంబాలకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌‌‌‌తో పాటు కారుణ్య నియామకాలు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.