బతికుండగానే చంపేసిన్రు

బతికుండగానే చంపేసిన్రు

డెత్ లిస్టులో120 మంది ఉపాధి కూలీలు
50 రోజులుగా అందని కూలి డబ్బులు
జాబితా పరిశీలించగా వెలుగులోకి..
మళ్లీ నమోదు చేసేందుకు ఒప్పుకోని రూల్స్‌‌‌‌!

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కరోనా కష్టకాలంలో ప్రతి కూలీకి ఈజీఎస్‌ కింద పనులు కల్పించాలని సర్కారు చెబుతుంటే.. ఆఫీసర్లు మాత్రం ఉన్న కూలీలను తొలగిస్తున్నారు. అది కూడా చనిపోయిన వారి లెక్కల్లోకి చేరుస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముదునూరులో జరిగిందీ ఘటన. చేసిన పనికి డబ్బులు రావడం లేదని కూలీలు ప్రశ్నించగా ఆఫీసర్లు లిస్టు పంపించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

327 మందికి జాబ్‌ కార్డులు

ముదునూరు గ్రామంలో 595 మంది కూలీలు ఉండగా 327 మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. అయితే ఇందులో చాలా మందికి జూన్‌ 6 నుంచి పని చేసిన డబ్బులు రావడం లేదు. దీంతో 10 రోజుల క్రితం పనులు మానేశారు. పెండింగ్ డబ్బులు చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు విన్నవించారు. ఈ విషయంపై ఎంపీడీవో ఆఫీసు నుంచి ఈ నెల 18న కూలీలకు సంబంధించిన పూర్తి జాబితాను గ్రామ పంచాయతీకి పంపించారు. ఇందులో 120 మంది కూలీలతో సహా గతంలో ఉపాధి పనులు చేసిన గ్రామ సర్పంచ్‌దామోదర్ రెడ్డి కూడా చనిపోయినట్లు ఉండడంతో అందరూ షాక్‌ అయ్యారు. తాము బతికిఉన్నామని ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రెండ్రోజుల క్రితం ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. దీంతో సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ముందే డెత్‌ అని నమోదు కావడంతో మళ్లీ అప్లోడ్ ‌కావడం లేదు.

గ్రామంలో నిలిచిన పనులు

కరోనా కష్టాల్లో పేదల కడుపు నిం పాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కారు వానాకాలంలోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. కందకాలు , గుంతలకు బదులు శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, కాలువల రిపేర్ల పనులు చేయిస్తున్నది. ప్రస్తుతం కూలీలను డెత్‌ లిస్టులో చేర్చడంతో గ్రామంలో పూర్తిగా పనులు నిలిచిపోయాయి.